విద్యార్థులపై కర్కశం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై కర్కశం

Sep 23 2025 7:33 AM | Updated on Sep 23 2025 7:33 AM

విద్య

విద్యార్థులపై కర్కశం

విశాఖ కలెక్టరేట్‌ను ముట్టడించిన ఏయూ విద్యార్థులు ప్రభుత్వానికి నిరసన సెగ.. అడ్డుకున్న పోలీసులు విద్యార్థుల ఛాతీపై పిడిగుద్దులు.. విద్యార్థినికి గాయం 26 మంది ఎస్‌ఎఫ్‌ఐ నేతల అరెస్టులతో ఉద్రిక్తత

మహారాణిపేట/మద్దిలపాలెం(విశాఖ): వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థులు కదం తొక్కారు. భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో సోమవారం ‘చలో కలెక్టరేట్‌’కార్యక్రమం చేపట్టారు. ఏయూ ప్రధాన ద్వారం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు వందలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నిరసన..ఘర్షణ..అరెస్టులు..

ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్న ఏయూ విద్యార్థులు, రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ర్యాలీకి, ధర్నాకు అనుమతులు లేవని, వెంటనే ఖాళీ చేయాలని పోలీసులు మైక్‌ల్లో హెచ్చరించినా విద్యార్థులు మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళన కొనసాగించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు కలిపి మొత్తం 26 మందిని అరెస్టు చేసి మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వంపై నేతల ఆగ్రహం

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.జె.నాయుడు మా ట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడా న్ని ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులపై భారం మోపుతోందని విమర్శించారు. ఏయూ ను గీతం ప్రైవేట్‌ యూనివర్సిటీకి దాసోహం చేస్తూ 46 పీజీ కోర్సులను ఎత్తివేశారని ఆయన మండిపడ్డారు. ఏయూ కమిటీ కన్వీనర్‌ డి.వెంకటరమణ మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలను వర్సిటీలో అడుగుపెట్టనివ్వమని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కూటమి నేతలు ఏయూను తమ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.

అరెస్టులను ఖండించిన పరిరక్షణ కమిటీ

విద్యార్థుల అరెస్టులను ఆంధ్ర యూనివర్సిటీ పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పొన్నాడ శ్రీనివాస్‌ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. అరెస్ట్‌ల సమయంలో పొన్నాడ ప్రగతి అనే ఇంజినీరింగ్‌ విద్యార్థిని తీవ్రంగా గాయపడి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఛాతీపై పిడిగుద్దులతో దాడి చేయడాన్ని, 26 మంది నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఖండించింది. ఆందోళనలో ఎస్‌ఎఫ్‌ఐ ఏయూ అధ్యక్షురాలు ఎం.కుసుమాంజలి, జిల్లా నాయకులు పి.సాయి తేజ, ఎం.నరేష్‌ ఎం.శశికుమార్‌, ఆర్‌.నిఖిల్‌, పి.ప్రగతి, వినీల, మౌనిక, బి.భరత్‌, విద్యార్థులు తరుణ్‌, సునీల్‌, సోమేష్‌, సంజయ్‌, కౌశల్‌ తదితరులు పాల్గొన్నారు.

27న హైడ్రోపవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ర్యాలీ

అరకులోయటౌన్‌: హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా అరకులోయలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 27న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 51 ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహించనున్న ర్యాలీలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలతోపాటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరారు.

విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ఇవీ..

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.అజయ్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రూ.6,800 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. పెరిగిన మెస్‌ బిల్లులకు అనుగుణంగా స్కాలర్‌ షిప్‌ను ప్రతి విద్యార్థికి నెలకు రూ.3500కు పెంచాలని, వర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, నాన్‌–టీచింగ్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, వర్సిటీ హాస్టళ్లకు విద్యుత్‌ సరఫరాను కమర్షియల్‌ పరిధి నుంచి డొమెస్టిక్‌ పరిధిలోకి మార్చాలని, వర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కేటాయించాలన్నారు. మేనేజ్‌మెంట్‌ కోటాను రద్దు చేసి 100 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలోనే భర్తీ చేయాలని, బకాయిల పేరుతో సర్టిఫికెట్లు నిలిపివేయకుండా, గతంలో లాగా ‘నో డ్యూస్‌’విధానంలో మంజూరు చేయాలని, యూజీసీ నిబంధనల ప్రకారం విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించి క్యాంపస్‌ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాష్ట్రవ్యాప్త కామన్‌ పీజీ సెట్‌ను రద్దు చేసి, వర్సిటీ పరిధిలోనే పీజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థులపై కర్కశం1
1/2

విద్యార్థులపై కర్కశం

విద్యార్థులపై కర్కశం2
2/2

విద్యార్థులపై కర్కశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement