
గోదాంలో మూలుగుతున్న 500 టన్నుల కాఫీ
ఆరు నెలలుగా నిల్వ
అధిక ధరకు రైతుల నుంచి సేకరణ
జీసీసీ నుంచి కొనుగోలుకు ఆసక్తి చూపని వ్యాపారులు
చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
చింతపల్లి: స్థానిక గిరిజన సహకార సంస్థ గోదాంలో ఐదు వందల టన్నుల కాఫీ గింజలు ఆరు నెలలుగా మూలుగుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో అవి పాడైపోయే ప్రమాదం ఉందని, అలా జరిగితే జీసీసీకి భారీ ఎత్తున నష్టం వస్తుందని స్థానికులు చెబుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చింతపల్లి డివిజన్ పరిధిలో గల చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల రైతుల నుంచి గత డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు చెర్రి కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు చేసింది. ఈ డివిజన్‌లో సేంద్రియేతర చెర్రి కాఫీని చింతపల్లి మండలంలో 19 వేల కిలోలు, జీకే వీధిలో 18,844 కిలోలు, కొయ్యూరులో 5,773 కిలోలను రైతుల నుంచి కొనుగోలు చేసి, వేలం ద్వారా పూర్తిగా విక్రయించింది. అదేవిధంగా ఈ మూడు మండలాల్లో సేంద్రియ కాఫీకి అధిక ధర ప్రకటించి, కొనుగోలు చేశారు. దానిలో భాగంగా చింతపల్లి మండలంలో 3,01,748 కిలోలు, జీకే వీధి మండలంలో 2,01,176 కిలోలను కొనుగోలు చేశారు. కిలోకు రూ.330 ధర చెల్లించారు. ప్రస్తుతం చింతపల్లిలో గొడౌన్‌లో 300 టన్నులు, జీకే వీధిలో 200 టన్నుల చెర్రీ కాఫీ గింజలు గత ఆరు నెలలుగా పడి ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.16.5 కోట్ల వరకూ ఉంటుంది. ఈ కాఫీ గింజలను వేలం పాట ద్వారా విక్రయించేందుకు వ్యాపారులను ఆహ్వానించినా ఆ ధరకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కిలో రూ.280కి మించి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. సేంద్రియ పంటగా ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నా...ఇది నాన్ ఆర్గానిక్ పంటగా వ్యాపారులు అనుమానిస్తున్నారని సమాచారం. దీంతో అంత ధర పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకురావడం లేదని తెలిసింది.
చింతపల్లి గోదాంలో నిల్వ ఉన్న చెర్రి కాఫీ బస్తాలు