
భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం
ముంచంగిపుట్టు : మండలంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, గెడ్డలు పొండగంతో మారుమూల గ్రామాల గిరిజనులు రాకపోకలు స్తంభించాయి. లక్ష్మీపురం పంచాయితీ ఉబ్బెంగుల వాగు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఉబ్బెంగుల, దొరగూడ గ్రామాల గిరిజనులు జలదిగ్భంధంలో చిక్కుకున్నారు. మాకవరం, జోలాపుట్టు, దొడిపుట్టు, కర్రిముఖిపుట్టు, పనసపుట్టు పంచాయతీల్లో పలు గ్రామాల్లో పంటపొలాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో నీట మునిగాయి. రాంపుట్టు గ్రామంలో కె.మంగరాజు, కె.భగవాన్, కె.బీష్‌నాధ్‌లకు చెందిన పంట పొలాల్లోకి వరద నీటితో మట్టి దిబ్బలు కొట్టుకు వచ్చి పంట పాడైంది. దీంతో గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో వరదనీరు వచ్చి చేరడంతో మత్స్యగెడ్డ పూర్తి స్థాయి నీటితో కళకళలాడుతుంది.
పొంగిపొర్లిన డ్రైనేజీలు
డుంబ్రిగుడ : భారీ వర్షంతో ఆదివారం మండల వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం ఇబ్బందులు తప్పడం లేదు. డ్రైనేజీలు పొంగి వరద నీరు ఇళ్లలోకి చేరుతుంది. అరకు, కించుమండ, గుంటసీమ, సొవ్వ తదితర పంచాయితీలలో భారీ వర్షాలతో ఇబ్బందులు పడ్డారు.
రాజవొమ్మంగిలో రెండో రోజు భారీ వర్షం
రాజవొమ్మంగి : రాజవొమ్మంగిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 16.2 మి.మీ వర్షం కురిసినట్టు జిల్లా గణాంకాధికారి మురళీకృష్ణ తెలిపారు. ఆదివారం కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అప్పలరాజుపేటలో వట్టి గెడ్డ రిజర్వాయర్ భారీ వర్షం కారణంగా మరోసారి పొంగి ప్రవహిస్తోంది. ఈ కారణంగా పొలాలకు వెళ్లిన వారు పొర్లు మదుము దాటేందుకు గంటల తరబడి ఒడ్డునే వేచి ఉండాల్సివచ్చింది.
పొంగుతున్న వాగులు, గెడ్డలు

భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం

భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం