
చైతన్యంతో గంజాయిని తరిమికొడదాం
సీలేరు: గంజాయి పెంపకం.. రవాణాకు ఒకప్పుడు అడ్డాగా ఉన్న గిరిజన గ్రామాలు.. అదే గిరిజనులు.. ఇప్పుడు గంజాయి వద్దు అభివృద్ధి ముద్దు అన్న నినాదంతో శనివారం ధారకొండ పంచాయతీ కేంద్రంలో పెద్ద ఎత్తున ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. సీలేరు, ధారకొండ, దుప్పులువాడ, గుమ్మిరేవులు, అమ్మవారి ధారకొండ పంచాయతీలకు చెందిన గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన చైతన్యం కార్యక్రమంలో గూడెంకొత్తవీధి సీఐ వరప్రసాద్ మాట్లాడుతూ చైతన్యం అనే కార్యక్రమం ద్వారా గంజాయి నిర్మూలనకు గిరిజనుల సహకారం చాలా అవసరమన్నారు. ఈ ప్రాంతంలో గంజాయి పండించకుండా చేయగలిగినా.. మన జీవితాల్లో ఇంకా గంజాయి అనేది ఉందన్నారు. దీనిని ఎప్పుడైతే పూర్తిస్థాయిలో లేకుండా చేస్తామో అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి వైపు చూస్తుందన్నారు. ఈ ప్రాంతంలో పండిస్తున్న గంజాయి గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు పంపించడం వల్ల అక్కడి యువకులు గంజాయి మత్తుకు బానిసై వారి జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. అలాగే పట్టుబడిన గిరిజనులు జైల్లో మగ్గుతున్నారన్నారు. గంజాయికి బదులు ఇతర పంటలు సాగు చేపడితే ప్రభుత్వం, పోలీస్ శాఖ సహకారం అందిస్తాయన్నారు. అప్పుడే ఆర్థికంగా ఎదిగి ఈ మారుమూల ప్రాంతాలు అభివృద్ధి వైపు అడుగులు పడతాయన్నారు. ఇకపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీ కేంద్రంలో గ్రామసభలు నిర్వహించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఒకప్పుడు గంజాయి పేరు మోపబడిన గ్రామాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఏ సమస్య వచ్చినా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీలేరు ఎస్‌ఐ రవీంద్ర, సీపీఐ సీనియర్ నాయకుడు విష్ణుమూర్తి, ధారకొండ సర్పంచ్ రాజు, గుమ్మరేవుల సర్పంచ్ కమలమ్మ, ఎంపీటీసీలు మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ధారకొండలో గిరిజనుల ర్యాలీ
భారీగా తరలివచ్చిన జనం
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టండి
అవసరమైన సహకారం అందిస్తాం: గూడెంకొత్తవీధి సీఐ వరప్రసాద్

చైతన్యంతో గంజాయిని తరిమికొడదాం