● సెల్ టవర్ ఎక్కి హంగామా
పాడేరు : మద్యం మత్తులో ఓ గిరిజన యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. చివరగా పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. మండలంలోని మినుములూరు గ్రామానికి చెందిన ఎల్. కిరణ్ అనే యువకుడు పూటుగా మద్యం సేవించి ఆదివారం మధ్యాహ్నం గ్రామంలోని ఓ సెల్ టవర్ ఎక్కాడు. తాను ఇష్టపడిన ఓ మహిళ దూరం పెట్టడంతో నిరాశకు లోనయ్యానని, వెంటనే ఆమె తనతో మాట్లాడాలని భీష్మించి కూర్చున్నాడు. దీంతో గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన వారు అగ్నిమాపక శకటంతో అక్కడికి చేరుకున్నారు. ఆ యువకుడికి నచ్చజెప్పారు. ఇంతలో వర్షం కురుస్తుండటంతో యువకుడు సెల్ టవర్ నుంచి దిగిపోయాడు. అతడికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.