
ఫిషరీస్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
నర్సీపట్నం: బి.ఆర్.ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. స్పాట్ కౌన్సెలింగ్ ఈనెల 11వ తేదీ వరకు జరుగుతుందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారన్నారు. ఆసక్తిగల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం 8247371907 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
విద్యుత్ షాక్‌తోజూనియర్ లైన్‌మన్ మృతి
ఎటపాక: విద్యుత్ లైన్లు సరిచేస్తుండగా షాక్‌కు గురై జూనియర్ లైన్‌మన్ మృతి చెందాడు. ఆదివారం వెంకటరెడ్డిపేట గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గుండాల గ్రామసచివాలయంలో ముర్రం నాగార్జున (35) జూనియర్ లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం వెంకటరెడ్డిపేట గ్రామంలో రైస్ మిల్ వద్ద వేపచెట్టు కొమ్మ విరిగి పడటంతో విద్యుత్ వైర్లు దెబ్బతిన్నాయి. వీటిని సరిచేసేందుకు లైన్‌మన్ శంకర్ జూనియర్ లైన్‌మన్ నాగార్జున, మరో ఇద్దరు సిబ్బందిని తీసుకుని అక్కడకు వచ్చారు. ముందుగా వీధిలోని ఓ డీబీ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆ తరువాత లైన్లను సరిచేస్తున్న క్రమంలో నాగార్జున పట్టుకున్న వైరుకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే అతనిని ఆటోలో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటు లో లేకపోవడంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగార్జున మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మండలంలోని బొజ్జిగుప్ప గ్రామానికి చెందిన మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్తిస్థాయిలో సరఫరా నిలిపి వేయకపోవడమే వల్ల నిండు ప్రాణం బలికావడానికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.