మారని తలరాత | - | Sakshi
Sakshi News home page

మారని తలరాత

Sep 8 2025 5:52 AM | Updated on Sep 8 2025 5:52 AM

మారని

మారని తలరాత

హామీల మోత..
చట్రాపల్లిలో ప్రకృతి విధ్వంసానికి నేటికి ఏడాది

దయనీయ స్థితిలో

బాధిత కుటుంబాలు

నోచుకోని మోడల్‌ కాలనీ నిర్మాణం,

ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు

సర్వేలతో సరిపెడుతున్న కూటమి ప్రభుత్వం

తోకరాయి, కమ్మరితోట

బాధితుల్లో నిరాశ

సీలేరు: గతేడాది ఇదేరోజు వరద బీభత్సంలో ఇళ్లు కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలిన చట్రాపల్లి బాధిత గిరిజనులకు ప్రభుత్వ సాయం హామీలకు పరిమితమైంది. ఇప్పటికీ ఆరోజు తలచుకుంటే వారి వెన్నులో వణుకు పుడుతోంది. మన్యంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన భారీ ప్రళయం చట్రాపల్లితోపాటు తోకరాయి ,కమ్మరితోట గిరిజన గ్రామాలకు తీవ్ర నష్టం మిగిల్చింది. రెక్కల కష్టంతో కట్టుకున్న ఇళ్లు, పెంచుకున్న ఆవులు, మేకలు, విలువైన భూములు తుడుచు పెట్టుకుపోయాయి. వరద బీభత్సం వయనాడ్‌ తరహా విలయాన్ని తలపించింది. మళ్లీ అలాంటి ప్రళయం సంభవిస్తే మా పరిస్థితి ఏంటని ఆయా గ్రామాల గిరిజనులు వాపోతున్నారు.

విరుచుకు పడటంతో..

భారీ తుపాను కారణంగా గత ఏడాది సెప్టెంబరు 8వ తేదీ అర్ధరాత్రి సంభవించిన వరద ప్రళయానికి చట్రాపల్లి గ్రామంలో ఇళ్లపై కొండచరియలు విరిగి పడ్డాయి. ఒకే కుటుంబానికి చెందిన కొర్రా కుమారి మృతి చెందగా సుమిత్ర, సుబ్బారావు, పండన్న కాళ్లు చేతులు విరిగిపోయాయి. అప్పటిలో మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందజేసింది. బాధితులకు ఇళ్లు నిర్మించి, భూమి కేటాయించి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. పడిపోయిన ఇళ్లలోనే ఉంటూ బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

● వరద బీభత్సానికి నిరాశ్రయులైన బాధితులు చట్రాపల్లిలో 37, ధారకొండ పంచాయతీ తోకరాయిలో 62 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరికి ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ స్థల పరిశీలనకు పరిమితమైంది. కమ్మరితోటలో పంట భూముల్లో ఇసుక, మట్టి మేటలు వేయడంతో సాగుకు అవకాశం లేకుండా పోయింది. పేరుకుపోయిన మట్టిని తొలగిస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేర్చక గ్రామ గిరిజనులే మట్టిని తొలగించుకున్నారు.

● బీభత్సం సృష్టించిన వరద మండలాన్ని సర్వనాశనం చేసింది. మండల కేంద్రం నుంచి సీలేరు సమీప వలసగెడ్డ వరకు రోడ్లపై కొండచరియలు విరిగిపడటంతో చెట్లు కూలి వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతోపాటు అంతర రాష్ట్ర రహదారిలో 45 రోజులపాటు రాకపోకలు నిలిచిపోయాయి. పరిశీలనకు వచ్చిన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పునరావాసంతో పాటు సీలేరు రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అదే గోతుల రహదారిలో ప్రయాణాలు సాగుతున్నాయి.

సర్వేలతో ఏడాది..

● చట్రాపల్లి, తోకరాయి గ్రామాల్లో వరదకు పాడైన ఇళ్లకు బదులుగా మోడల్‌ కాలనీలు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏడాది అయినా అమలుకు నోచుకోలేదు. జిల్లా అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించినా ఏమాత్రం కదలిక లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

● కొండచరియల బీభత్సానికి సాగు భూముల్లో ఇసుక, మట్టి దిబ్బలు పేరుకుపోయాయి. వ్యవసాయానికి పనికిరాకుండా పోయాయి. సర్వే చేసిన అధికారులు పంటనష్టం మాత్రమే అరకొరగా ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా భూములిస్తామన్న హామీ నెరవేరలేదు.

అర్ధరాత్రి సమయంలో సంభవించిన ఊహించని ఉత్పాతానికి అతలాకుతలమైన గూడెంకొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లిలో పరిస్థితులు ఈ ఘటన జరిగి ఏడాది అవుతున్నా మెరుగుపడలేదు. కొండచరియలు విరిగి పడటంతో చట్రాపల్లి, తోకరాయిలో ఇళ్లకు నష్టం వాటిల్లింది. ఆయా గ్రామాలతోపాటు కమ్మరితోటలో సాగు భూములు ధ్వంస మయ్యాయి. మోడల్‌ కాలనీ నిర్మిస్తామమని, దెబ్బతిన్న పంట భూములకు ప్రత్యామ్నాయంగా భూములు కేటాయిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

కలెక్టర్‌కు నివేదించాం

గతేడాది సంభవించిన వరద బీభత్సానికి చట్రాపల్లిలో 37, తోకరాయిలో 62 కుటుంబాలకు ఇళ్లు నిర్మించేందుకు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేశాం. వరద ధాటికి కొన్ని ఇళ్లు కూలిపోయాయి. మరికొన్నింటిని మట్టి దిబ్బలు కప్పేశాయి. మళ్లీ ఆ గ్రామాలకు వరద వచ్చే అవకాశాలు ఉన్నందున వాటిని పూర్తిగా ఖాళీ చేయించి వేరేచోట మోడల్‌ కాలనీ తరహాలో నిర్మాణానికి భూమిని పరిశీలించి కలెక్టర్‌కు నివేదించాం. త్వరలో ఇళ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాం. –అన్నాజీరావు,

తహసీల్దార్‌, గూడెంకొత్తవీధి

నిలదీసినా స్పందించలేదు

గత ఏడాది తుపానుకు కొట్టుకుపోయిన గ్రామాలకు ఇప్పటివరకు ప్రభు త్వం ఏ హామీని నెరవేర్చలేదు. ఇళ్లు కట్టిస్తామని సర్వే చేస్తున్నారు తప్ప న్యాయం జరగడం లేదు. పాడేరులో ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో నిలదీసినా అధికారులు స్పందించలేదు. – విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే, పాడేరు

ప్రత్యామ్నాయం చూపించాలి

మూడు గ్రామాల్లో పంట భూములు నాశనమ య్యాయి. ఇప్పటివరకు అధికారులు ప్రత్యామ్నాయంగా భూమిని కల్పించలేదు. ఒక పక్క ఇళ్లు లేక మరోపక్క ఆర్థికంగా నష్టం జరిగింది. అయినా ప్రభుత్వం, అధికారుల నుంచి స్పందన కరువైంది.

– రాజు, సర్పంచ్‌, ధారకొండ

మారని తలరాత1
1/6

మారని తలరాత

మారని తలరాత2
2/6

మారని తలరాత

మారని తలరాత3
3/6

మారని తలరాత

మారని తలరాత4
4/6

మారని తలరాత

మారని తలరాత5
5/6

మారని తలరాత

మారని తలరాత6
6/6

మారని తలరాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement