
బెర్రీ బోరర్‌ను సమర్ధంగా ఎదుర్కొంటాం
● ఉద్యాన విశ్వవిద్యాలయం
డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ మధుమతి
● చింతపల్లి ఉద్యానవనన పరిశోధన స్థానం సందర్శన
చింతపల్లి: జిల్లాలో కాఫీ తోటలకు ఆశించిన కాయతొలుచు పురుగు (బెర్రీ బోరర్)ను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాల యంత్రాంగాలు సిద్ధంగా ఉన్నాయని వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ మధుమతి అన్నారు. శనివారం ఆమె చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
అరకులోని కొందరు గిరిజన కాఫీతోటలతోపాటు చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలోని తోటల్లో బెర్రీ బోరర్ కనిపించిందన్నారు. ఈ పురుగు మిగతా తోటలకు ఆశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగానే తోటల్లోని కాయలన్నింటినీ పూర్తిగా పంట కోత చేపట్టాలని ఆదేశించారు. సేకరించిన కాఫీ పిందెలను శాస్త్రవేత్తల సమక్షంలో నాశనం చేసి భూమిలో పూడ్చిపెట్టారు. రైతులు ఈ పురుగును గుర్తించిన వెంటనే సంబంధిత కాఫీ విభాగం అధికారులు, ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తలకు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. జిల్లాలోనూ రైతులకు లాభదాయకమైన పసుపు, అల్లం, మిరియం సాగుపై ఎప్పటికప్పుడు తమ పరిశోధనా స్థానం ద్వారా అవసరమైన సాంకేతిక సలహాలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఉద్యాన పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ వెంకటరత్నం, ఉద్యాన శాస్త్రవేత్తలు డాక్టర్ శివకుమార్, బిందు, సాంకేతిక అధికారులు అప్పలరాజు, ఓంకార్, ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధనాస్థానం జేఎల్‌వో నాగేశ్వరరావు పాల్గొన్నారు.