
అరకు ఇక రాయగడకే!
ఆదాయాన్నిచ్చే కొరాపుట్ మార్గం కూడా రాయగడ పరిధిలోకి..
అరకు కోసం వినతులిచ్చినాపట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
వాల్తేరు నుంచి కొత్త డివిజన్‌లో చేర్చిన రైల్వే బోర్డు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా ఊటీ అరకు ఇప్పుడు రాయగడ పరమైపోయింది. వాల్తేరు రైల్వే డివిజన్‌లో భాగంగా ఉన్న అరకు.. జోన్ విభజన తర్వాత కొత్త డివిజన్‌లో చేరుతోంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా వాల్తేరు డివిజన్ నుంచి మేజర్ భాగాలను విడదీసి రాయగడ డివిజన్‌లో కొంత, విశాఖ డివిజన్‌లో మరికొంత భాగాన్ని విలీనం చేయాలన్న తుది డీపీఆర్‌కూ బోర్డు ఆమోద ముద్ర వేసేసింది. ఇక గెజిట్ వచ్చేస్తే.. చారిత్రక వాల్తేరు కనుమరుగుకు.. అరకు ప్రాంతం రాయగడకు ఇక అధికారికంగా రాజముద్ర పడిపోయినట్లే. ఆదాయాన్నిచ్చే అరకు, కొరాపుట్ మార్గాలను విశాఖ డివిజన్‌లో ఉంచాలన్న వినతులను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రకు రిక్తహస్తాలు చూపించింది.
వాల్తేరు డివిజన్‌ను విడదీసేసి..
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాల్తేరు డివిజన్ విభజన తథ్యం అన్నట్లుగా రైల్వే బోర్డు ముందుగానే సంకేతాలిచ్చింది. ఇందులో భాగంగా వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ రాయగడ డివిజన్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇటీవలే వైజాగ్ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు ప్రధాని శంకు స్థాపన చేశారు. ఇటీవలే మార్పులు చేసిన డీపీఆర్‌ని కూడా బోర్డు ఆమోదించేసింది. వాల్తేరును కొనసాగించాలని ఒత్తిడి తీసుకొచ్చినా దాన్ని పెడచెవిన పెట్టేసింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త డివిజన్‌కు డీపీఆర్‌లో స్పష్టం చేసింది.
410 చ.కి.మీ మేర విశాఖ డివిజన్
సరిహద్దుల విషయంలో బోర్డు కఠినంగా వ్యవహరించింది. గుణుపూర్–తేరుబలి కొత్త లైన్ పూర్తయ్యే వరకు గుణుపూర్– పర్లాఖిముండి సెక్షన్ సహా, నౌపడ–గుణుపూర్ లైన్‌ని కొత్తగా ఏర్పాటవుతున్న విశాఖ డివిజన్‌లో ఉంచాలని ప్రతిపాదించారు. కానీ దీన్ని బోర్డు అంగీకరించలేదు. సుమారు 410 చ.కి.మీ మేర విశాఖపట్నం డివిజన్‌గా ఏర్పాటు కానుంది. వాల్తేరులోని మిగిలిన భాగమైన కొత్తవలస నుంచి కిరండూల్, కూనేరు–తెరువలి జంక్షన్, సింగాపూర్ రోడ్ నుంచి కొరాపుట్ జంక్షన్, పర్లాఖిముండి నుంచి గుణుపూర్ వరకూ దాదాపు 680 కి.మీ మేర రాయగడ డివిజన్ పరిధిలోకి రాబోతోంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ విశాఖపట్నం జోన్ నుంచి రాయగడలోకి వెళ్లిపోయింది. పార్వతీపురం సమీపంలోని కూనేరు కూడా రాయగడ డివిజన్‌కే ఇచ్చేశారు. కొత్తవలస నుంచి పలాస వరకు విశాఖపట్నం డివిజన్‌లో ఉంచారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టేషన్లన్నీ తూర్పు కోస్తా జోన్‌లోని ఖుర్దా డివిజన్‌లో ఉన్నాయి. అరకు, కోరాపుట్ లైన్ విశాఖ డివిజన్‌కు ఇవ్వాలని ఎన్ని ప్రతిపాదనలు పంపించినా కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసేసింది.
గెజిట్ వచ్చేలోపైనా కూటమి కళ్లు తెరిస్తేనే..!
తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్ వాల్తేరు. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ.15 వేల కోట్లు కాగా, ఇందులో రూ.8 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టికెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా రాయగడ డివిజన్‌కు సొంతమవుతుంది. వాల్తేరుకు రావాల్సిన ఆదాయం దాదాపు సింహభాగం కోల్పోయినట్లే అవుతుంది. జోన్‌కు సంబంధించి ఇంకా గెజిట్ విడుదల కాలేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, ఎంపీలు పట్టుబట్టి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే విశాఖ డివిజన్‌కు మంచి జరిగే అవకాశం ఉంది. కానీ.. కూటమి నేతలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు.