
తత్కాల్ టికెట్‌కు ముందురోజు నమోదు చేసుకొనే వెసులుబాటు
మరుసటిరోజు క్యూలో ఉంటే చాలు
అగనంపూడి: దువ్వాడ రైల్వేస్టేషన్‌లో తత్కాల్ టికెట్ తీసుకోవాల్సిన ప్రయాణికులు ముందురోజు రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన పత్రంపై పేరు, సీరియర్ నంబర్, ఆధార్ నంబర్ రాసి తర్వాత రోజు టికెట్ కోసం క్యూలో ఉంటే సరిపోతుంది. ఈ విధానం దువ్వాడ రైల్వేస్టేషన్ అధికారులు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే తత్కాల్ టికెట్లను ముందు రోజు జారీ చేస్తారు. వాటి కోసం అదేరోజు తెల్లవారు జాము నుంచి ప్రయాణికులు స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తుంటారు. దీంతో ప్రయాణికులు తోపులాటకు దిగుతుండడంతో దువ్వాడ రైల్వే కమర్షియల్ అధికారి ఎం.ఎస్.రావు చొరవ తీసుకొని ముందురోజు రాత్రి 9.30 పది గంటల మధ్యలో అధికారికంగా ఒక పేపర్ ఏర్పాటు చేస్తున్నారు. వాటిపై పేర్లు, ఆధార్ నంబర్ రాసి పెట్టి మరుసటిరోజు ఉదయం కౌంటర్ తెరవకముందు వస్తే సీరియల్ నంబర్ ప్రకారం పిలిచి టికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో ఎవరు నమోదు చేశారో వారికే టికెట్ అందుతుండడం, ఏజెంట్లు హడావుడి లేకుండా ఆర్పీఎఫ్ సహకారంతో సజావుగా టికెట్ల జారీ ప్రక్రియ సాగుతుండడంతో ప్రయాణికులు హర్షిస్తున్నారు.