
మహిళల ఆర్థికాభివృద్ధికి రుణాలు
పాడేరు రూరల్: మహిళల ఆర్థికాభివృద్ధికి రుణాలు అందిస్తున్నామని డీఆర్‌డీఏ పీడీ మురళి తెలిపారు. గురువారం స్థానిక కాఫీ హౌస్‌లో నిర్వహించిన అగ్రి అవుట్ రీచ్ క్యాంపులో ఆయన యూబీఐ విజయనగరం రీజనల్ హెడ్ జితేంద్రశర్మతో కలిసి డ్వాక్రా మహిళ సంఘాలకు రూ.5 కోట్ల విలువైన రుణాల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పీడీ మురళి మాట్లాడుతూ బ్యాంకులు అందిస్తున్న రుణాలను డ్వాక్రా సంఘాల సభ్యులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. తీసుకున్న రుణాలతో వివిద రకాల వ్యాపారాలు చేపట్టి ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. రుణాలు పొందిన సభ్యులు సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించి మరింత రుణాలు తిరిగి పొందేలా ఉండాలన్నారు, యూబీఐ రీజనల్ హెడ్ జితేంద్రశర్మ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు యూనియన్ బ్యాంక్ ఎల్లప్పుడూ ఆర్థిక తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ జోనల్ హెడ్ నగేష్, డిప్యూటీ హెడ్ ఆర్‌హెచ్ రాజు, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాయుడు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ భాను తదితరులు పాల్గొన్నారు.