
దశాబ్దాల కల.. నెరవేరుతున్న వేళ
ముమ్మరంగా సర్వే..
సీలేరు నుంచి దారకొండ సబ్ స్టేషన్‌కు రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా 33 కేవీ లైన్ వేసేందుకు ట్రాన్స్‌కో సీఎండీ రూ.4 కోట్లు మంజూరు చేశారు. దీంతో డిఫరెన్షియల్ జియోలాజికల్ పొజిషన్ సిస్టమ్ (డీజీపీఎస్) ద్వారా సర్వే చేసున్నారు. తొమ్మిది కిలోమీటర్ల అటవీ మార్గం గుండా విద్యుత్ లైన్లను వేసి అంతరాయం లేకుండా గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు సర్వే జరుపుతున్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని ట్రాన్స్‌కో ఏఈఈ కె.ఎస్. రాంబాబు తెలిపారు.
● గిరి గ్రామాలకు తీరనున్న
విద్యుత్ సమస్య
● సీలేరు నుంచి దారకొండకు
విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు
● రిజర్వ్ ఫారెస్టులో డీజీపీఎస్ సర్వే
● రూ.4 కోట్లు విడుదల చేసిన
ట్రాన్స్‌కో సీఎండీ
● హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు
సీలేరు:
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వందల గ్రామాల అడవిబిడ్డల ఏళ్ల నాటి కల ఫలించనుంది. సీలేరు జల విద్యుత్ కేంద్రం నుంచి ఆ గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయనుండడంతో వారి కష్టాలు తీరనున్నాయి. దుప్పులవాడ,దారకొండ,గుమ్మిరేవుల,అమ్మవారిదారకొండ తదితర పంచాయతీల పరిధిలో సుమారు 500 గ్రామాల గిరిజనులు ఏక తాటిపైకి వచ్చి సీలేరు జలవిద్యుత్ కేంద్రం నుంచి కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 40 ఏళ్లుగా ధర్నాలు, బంద్‌లు, వంటావార్పులతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సీలేరు నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో ప్రకటించింది.దీంతో ఆయా గ్రామ గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఇలా..
సీలేరు జలవిద్యుత్ కేంఽద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్ 220 కేవీ లైన్ల ద్వారా గాజువాక సబ్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడనుంచి నర్సీపట్నం, చింతపల్లి, గూడెం మీదుగా దారకొండ సబ్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడనుంచి గిరిజన గ్రామాలకు సరఫరా అవుతోంది. ఈ క్రమంలో చిన్నపాటి గాలులు వీచినా.. వర్షాలు పడినా విద్యుత్ లైన్లపై చెట్ల కొమ్మలు పడి సరఫరా నిలిచిపోతోంది. విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుందో తెలియక చీకట్లోనే మగ్గిపోవలసి వస్తోంది. ఈ బాధలు భరించలేక ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టారు. సీలేరు విద్యుత్ కేంద్రం పక్కనే ఉన్న తమ గ్రామాలకు సీలేరు నుంచి విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేశారు. వారి పోరాటం ఇన్నాళ్లకు ఫలిస్తోంది.
ఎంసీఆర్‌ని పేల్చివేసి...
సీలేరు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఇక్కడ గిరిజనులకు ఇవ్వకుండా వారి ఇళ్లపై నుంచి లైన్ల ద్వారా మైదాన ప్రాంతాలకు, కంపెనీలకు తరలిస్తున్నారని, ఇది తగదని, తక్షణమే ఈ ప్రాంత గిరిజన గ్రామాలకు సీలేరు నుంచి విద్యుత్ సరఫరా చేయాలని గతంలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. స్పందించనందుకు నిరసనగా 2007 సంవత్సరం డిసెంబరు 24న సీలేరు జల విద్యుత్ కేంద్రంలో ఎంసీఆర్‌ని మావోయిస్టులు పేల్చివేశారు. అప్పుడు కొన్ని గ్రామాలకు విద్యుత్‌ను సరఫరా ఇచ్చి అధికారులు చేతులు దులుపుకొన్నారు. గత ఏడాది ఇదే విషయంపై ఈ ప్రాంత నాయకులు ధర్నాకు సిద్ధమవుతుండడంతో అప్పటి కలెక్టరు సుమిత్‌కుమార్ వారితో చర్చలు జరిపి ట్రాన్స్‌కో సీఎండీకి విషయాన్ని తెలియజేశారు.దీంతో గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు ప్రారంభించారు.
మా కోరిక నెరవేరుతోంది
సీలేరు ప్రాజెక్టు నుంచి విద్యుత్ సరఫరాచేయాలన్న డిమాండ్ ఇన్నాళ్లకు నెరవేరుతోంది. చిన్నపాటి గాలివీచినా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో చీకట్లో మగ్గిపోతున్నాం. దారకొండ సబ్‌స్టేషన్ నుంచి గ్రామాలకు నేరుగా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది. దీంతో విద్యుత్ కష్టాలు తీరుతాయి.
– రాజు, సర్పంచ్, దారకొండ
త్వరలోనే ప్రారంభిస్తాం
సీలేరు నుంచి దారకొండకు 33 కేవీ లైను ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం సర్వే జరుగుతోంది.అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
–కె.ఎస్.రాంబాబు, ఏఈఈ, చింతపల్లి

దశాబ్దాల కల.. నెరవేరుతున్న వేళ

దశాబ్దాల కల.. నెరవేరుతున్న వేళ

దశాబ్దాల కల.. నెరవేరుతున్న వేళ

దశాబ్దాల కల.. నెరవేరుతున్న వేళ