
రోగులపట్ల నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులు
పాడేరు : స్థానిక జిల్లా ఆస్పత్రి నుంచి కేజీహెచ్‌కు,
మైదాన ప్రాంతంలోని ఇతర ఆస్పత్రులకు రోగులను రిఫరల్ చేయడంలోను, వారిని ఆస్పత్రులకు తరలించడంలో నిర్లక్ష్యం వహించి, వారి మరణానికి కారణమైతే వైద్యులు, అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్ గౌడ, డీఎంహెచ్‌వో డాక్టర్ జమల్‌బాషాతో కలిసి ఆయన సోమవారం జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సమావేశ మందిరంలో వైద్యులు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగుల మరణాలు తగ్గించేలా, రిఫరల్ కేసులు తగ్గే విధంగా వైద్యులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోగి పూర్తి డేటాను అందుబాటులో ఉంచాలని సూచించారు. రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. కేస్ షీట్‌లో రోగి వివరాలు, చికిత్స వివరాలు సమగ్రంగా పొందుపర్చాలని తెలిపారు. ప్రతి 15రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడకు సూచించారు. ఆస్పత్రిలో మరమ్మతులకు గురైన అంబులెన్స్‌లను బాగు చేయించి, తక్షణం అందుబాటులో ఉంచాలన్నారు. డీఎంహెచ్‌వో, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ సమన్వయంతో పని చేయాలన్నారు.
మాతాశిశు విభాగం సందర్శన
ఆస్పత్రిలోని మాతాశిశు విభాగాన్ని కలెక్టర్ దినేష్‌కుమార్ సందర్శించారు. చిన్న పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వార్డులో మలేరియా జ్వరంతో బాధపడుతున్న చిన్నారి సూకూరు మహాలక్ష్మికి రక్తం తక్కువగా ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని తండ్రి బాబురావు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తక్షణమే అవసరమైన రక్తం ఎక్కించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జమల్‌బాషా, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, జిల్లా ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ విశ్వమిత్ర, డిప్యూటీ సూపరింటెండెంట్, గైనికాలజిస్ట్ హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ టి.నర్శింగరావు, ఆర్‌ఎంవో డాక్టర్ వెంకట్, జనరల్ మెడిసిన్ హెడ్ ప్రొఫెసర్ సురేష్, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధి పల్టాసింగి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్

రోగులపట్ల నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులు