‘ఆరోగ్య పాఠశాల 3.0’లో భాగంగా..
సాయంత్రం సమయంలో సాధన
చదువు ఒత్తిడి నుంచి ఉపశమనం
విద్యార్థుల్లో ఏకాగ్రత, ప్రశాంతతకు దోహదం
బోథ్: ఉదయం నుంచి పుస్తకాలు.. తరగతి గదుల్లో పాఠాలు.. పరీక్షల ఒత్తిడి.. సాయంత్రానికి అలసట.. విద్యార్థుల రోజువారీ జీవితంలో ఇవన్నీ సహజమే. అయితే చదువుతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఆరోగ్య పాఠశాల 3.0’ లో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు యోగా, ధ్యానం, ప్రాణాయామ సాధన చేయిస్తున్నారు. రోజంతా తరగతి గదుల్లో గడిపిన విద్యార్థులు సాయంత్రం పాఠశాల ఆవరణలోకి వచ్చి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవడం, ప్రాణాయామం చేయడం, సూర్య నమస్కారాలు, సులభమైన యోగాసనాల సాధన దినచర్యలో భాగమవుతోంది. దీంతో చదువుతోపాటు శారీరక చురుకుదనం, మానసిక ప్రశాంతతపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఏర్పడుతోంది.
యోగాతో మానసికోల్లాసం..
జిల్లాలో పీఎంశ్రీ, ఉన్నత, ప్రాథమిక, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు యోగాను వారానికి ఒకసారి శిక్షకుల సాయంతో నేర్పిస్తున్నారు. ఉదయం నుంచి పాఠాలు, వివిధ విద్యా కార్యకలాపాలతో బిజీగా ఉండే చిన్నారులకు ఉదయం లేదా సాయంత్రం సమయం కొంత విశ్రాంతి కలిగించే వేళ. ఆ సమయంలో యోగా, ధ్యానం చేయించడం ద్వారా రోజంతా ఎదురైన ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందేలా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థుల్లో కనిపించే ఆందోళనను తగ్గించేందుకు యోగా ఎంతో మానసికోల్లాసాన్ని కలిగిస్తోంది. యోగా సాధనలో భాగంగా భ్రమరి, నాడీశోధన ప్రాణాయామం, ధ్యానం, సూర్య నమస్కారాలు, వివిధ ఆసనాలను విద్యార్థులకు నేర్పిస్తున్నారు.
జిల్లాలో యోగా శిక్షణ
ఇస్తున్న ప్రభుత్వ పాఠశాలలు
ఉన్నత 109
ప్రాథమికోన్నత 102
మోడల్ స్కూళ్లు 06
కేజీబీవీలు 18
మొత్తం విద్యార్థులు సుమారు 30 వేలు
యోగా శిక్షకులు 20


