కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యనిర్వాహక కమిటీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. సాధారణ ఎన్నికలను తలపించాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా ఓటర్లు భా రీగా తరలివచ్చారు. క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, పలువురు అభ్యర్థులకు మద్దతుగా రాజకీయ నాయకులు హాజరై ఓటును అభ్యర్థించడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 3,999 మంది ఓటర్లు ఉండగా 46 మంది పోటీలో ఉండగా.. 1546 మంది ఓటు వేశారు. 3గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు. కలెక్టర్ రాజర్షిషా స్వయంగా పోలింగ్‌కేంద్రం 4లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల పరిశీలకులు, అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌తో కలిసి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. మధ్యాహ్నం 3.30గంటలకు పోలింగ్ ముగియగా 4గంటల నుంచి ఓట్లలెక్కింపు చేపట్టారు. అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లోనూ దొంగఓట్ల వినియోగం జరగడం చర్చనీయాంశంగా మారింది. పలువురు ఓటు వేసేందుకు రాగా అప్పటికే వారి ఓటును ఇతరులు వేసివెళ్లిపోయినట్లుగా అక్కడి అధికారులు చెప్పడంతో విస్తుపోయారు. విషయాన్ని ఓ ఓటరు స్వయంగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా విచారించి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు.
పకడ్బందీగా బందోబస్తు
ఉద్యోగ, ఉపాధ్యాయ, యువజన, రాజకీయ, వ్యా పార వర్గాలకు చెందిన అభ్యర్థులు పోటీలో నిలువడంతో వారికి మద్దతుగా ఆయా వర్గాల వారు భారీ గా తరలివచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టూటౌన్ సీఐ కె.నాగరాజు స్వయంగా అక్కడే ఉండి బందోబస్తును పర్యవేక్షించారు.


