ఉట్నూర్‌రూరల్: గూడ్స్ వాహనాన్ని ఉట్నూర్ కొత్తగూడ చెక్‌పోస్టు వద్ద ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో డ్రైవర్, ఫారెస్ట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జన్నారం మండలం ఇందన్‌పల్లి గ్రామానికి చెందిన గూడ్స్ వెహికల్ డ్రైవర్ తీర్థాల సత్యంకు చెందిన రెండు గూడ్స్ వాహనాలు శనివారం రాత్రి దాదాపు 9.15 గంటలకు కొత్తగూడెం చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నాయి. చెక్‌పోస్టు దాటి వెళ్లకూడదని అక్కడున్న ఫారెస్ట్ సిబ్బంది వాహనాలను పక్కకు నిలపాలని ఆదేశించారు. వాహనాలకు అనుమతి పత్రాలు ఉన్నాయని, లోకల్ బండి అని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ విధుల్లో ఉన్న ఫారెస్ట్ సిబ్బంది దుర్భాషలాడుతూ, దాడి చేసి గాయపర్చారని సత్యం ఆరోపించాడు. అనంతరం వాహనాలను వదిలిపెట్టారని పేర్కొన్నాడు. ఆదివారం ఉదయం సంఘటనపై ఉట్నూర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అయితే బీర్సాయిపేట ఎఫ్‌ఆర్‌వో అరుణ మాట్లాడుతూ కొత్తగూడ చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, తనిఖీల్లో భాగంగా వాహనాలను నిలిపివేయడంతో గూడ్స్ డ్రైవర్ సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సదరు వ్యక్తి సిబ్బందిపై అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ, వారితో గొడవకు దిగాడని తెలుస్తోందన్నారు. ఉదయాన్నే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించి ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.


