బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో గత 15 రోజులుగా ప్రధాన జనరేటర్ మరమ్మతులకు గురికావడంతో ఆలయ పరిసరాలు, అతిథి గృహాలు (కాటేజీలు) అంధకారంలో మగ్గుతున్నాయి. కరెంట్ పోయిన ప్రతిసారీ ఆలయ ప్రాంతమంతా చీకటిమయంగా మారుతుండటంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కొద్ది రోజుల్లోనే పవిత్రమైన శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరానున్నారు. ఇలాంటి కీలక సమయంలో పక్షం రోజులుగా జనరేటర్ రిపేరును పట్టించుకోక పోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే కటిక చీకట్లో చిన్నపిల్లలు, వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి, ఉత్సవాలు ప్రారంభం కాకముందే జనరేటర్ మరమ్మతులు పూర్తి చేయాలని, రా నున్న నవరాత్రులలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


