కై లాస్‌నగర్: మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీ, అష్టలక్ష్మి స్పిన్నింగ్ మిల్లుల ఆస్తి పన్ను బకాయిలు వసూలులో మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూటమి కౌన్సిలర్లు ఆరోపించారు. సీసీఐ ఆస్తిపన్ను బకాయిలు రూ.4.44 కోట్లు, స్పిన్నింగ్ మిల్లు బకాయిలు రూ.2.20 కోట్లను వెంటనే వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. బకాయిల వివరాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ, మున్సిపాలిటీకి ఆ రెండు సంస్థల ద్వారా రూ.7కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. దుకాణ సముదాయాలు, నివాస గృహాల పన్నులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న అధికారులు ఈ సంస్థల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. మున్సిపాలిటీకి తగిన నిధులు లేక సతమతమవుతుంటే బకాయిలు వసూలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించి వాటి ఆస్తులను జప్తుచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కౌన్సిలర్లు పాల్గొన్నారు.


