బాసర: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందించడమే లక్ష్యంగా బాసర ఆర్జీయూకేటీని ముందుకు తీసుకెళ్తున్నామని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. క్యాంపస్‌లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, పరిశోధన, స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
వీసీగా బాధ్యతలు స్వీకరించాక మీ ముందున్న సవాళ్లు ఏమిటి? ఎలా అధిగమించారు?
వీసీ: విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది మధ్య పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించడం. కార్యాలయాలకే పరిమితమై నిర్ణయాలు తీసుకోకుండా.. నేరుగా విద్యార్థుల వద్దకే వెళ్లి వారి సమస్యలను ఆలకించడం, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడటం, అధ్యాపకులతో సమగ్రంగా చర్చించడం అనే నూతన శైలిని ఆచరణలోకి తెచ్చా.
రాత్రివేళల్లో హాస్టళ్లను సందర్శించాలనే ఆలోచన ఎందుకొచ్చింది?
వీసీ: రాత్రివేళల్లో నేరుగా పర్యటించడం వల్ల వారి భద్రత, ఆరోగ్యం, మెస్ భోజన వసతి, పరిశుభ్రత, వారి మానసిక స్థితిగతులను క్షేత్రస్థాయిలోనే తెలుసుకునే వీలుంటుంది.
ఒక విద్యార్థి మిమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చా?
వీసీ: విద్యార్థుల ఫిర్యాదులు, సమస్యలు పక్కా వ్యవస్థ ద్వారా పరిష్కారం కావడమే సరైన పద్ధతి. అత్యవసర సందర్భాల్లో విద్యార్థులు తమ సమస్యలను నేరుగా నా దృష్టికి తెచ్చేలా సులువైన సమాచార వ్యవస్థలను అందుబాటులోకి తెస్తున్నాం.
తల్లిదండ్రుల విశ్వాసాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
వీసీ: క్యాంపస్ విద్యా పురోగతిపై వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం, పారదర్శకమైన నిర్వహణ, విద్యార్థుల క్షేమానికి ఇచ్చే ప్రాధాన్యత వారిలో నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. అవసరమైన సందర్భాల్లో ప్రత్యక్షంగా వారితో మాట్లాడి భరోసా ఇస్తున్నాం.
ఆర్జీయూకేటీకి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు మీ ప్రణాళిక ఏమిటి?
వీసీ : నాణ్యమైన విద్యాబోధన, పరిశోధన పరిశ్రమల అనుసంధానం, నవకల్పనలు (స్టార్టప్ సంస్కృతి), డిజిటల్ పరిపాలన, సామాజిక బాధ్యత ఆధారంగా క్యాంపస్‌ను ముందుకు తీసుకెళ్తున్నాం. గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించే కేంద్రంగా దీనిని తీర్చిదిద్దడమే మా ప్రధాన ధ్యేయం.
ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు ట్రిపుల్ ఐటీని వేదికగా మార్చే ఆలోచన ఉందా?
వీసీ: కచ్చితంగా ఉంది. మా విద్యార్థులు కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మాత్రమే కాక, నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థాపకులుగా ఎదగాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్ ఫండింగ్ మద్దతు, ఇండస్ట్రీ కనెక్టివిటీ, పరిశోధనా వాతావరణాన్ని విస్తృతంగా పెంచుతున్నాం.
‘ఓపెన్ డోర్ పాలసీ’అమలు చేస్తున్నారా?
వీసీ: విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తమ సమస్యలను, విలువైన సూచనలను ఎటువంటి భయాందోళనలు లేకుండా వ్యక్తం చేసే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం. ‘సంభాషణే ఏ సమస్యకై నా తొలి పరిష్కారం’అనే సూత్రంతో అందరికీ నిరంతరం అందుబాటులో ఉండే సుపరిపాలనగా తీర్చిదిద్దుతున్నాం.


