బ్యాటింగ్‌కు పదును.. | - | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్‌కు పదును..

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

● వేసవిలో క్రీడా మైదానాల్లో సందడి ● క్రికెట్‌ శిక్షణలో చిన్నారులు

నిర్మల్‌టౌన్‌: వేసవి సెలవులను చిన్నారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంపుల్లో చేరి వివిధ క్రీడల్లో నైపుణ్యం మెరుగుపర్చుకుంటున్నారు. ఏ గల్లీలో చూసిన అంతా ఒకచోట చేరిపోయి బ్యాట్‌, బంతి పట్టుకొని క్రికెట్‌ ఆడుతూ కనిపిస్తున్నారు. ఇటీవల ఐపీఏలో అద్భుత ప్రతిభ కనబర్చి అందర్నీ ఆకర్షించిన యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీని స్ఫూర్తిగా తీసుకుని శిక్షణలో ముందుకెళ్తున్నారు.

చిన్ననాటి నుంచి ఇష్టం

నేను పదోతరగతి చదువుతున్నా. చిన్ననాటి నుంచి క్రికెట్‌ అంటే నాకు ఇష్టం. వేసవిలో క్రికెట్‌లో శిక్షణ పొందుతున్నా. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో నైపుణ్యం మెరుగుపర్చుకుంటున్నా. క్రమశిక్షణతో సాధన చేస్తున్నా. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో ఆడి నా ప్రతిభను నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం. – సోఫియాన్‌, నిర్మల్‌

క్రికెట్‌ శిక్షణ పొందుతున్నా

నేను నాలుగోతరగతి చదువుతున్నా. వేసవి సెలవుల్లో నిర్మల్‌ పట్టణంలో టీసీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంపులో క్రికెట్‌ శిక్షణ పొందుతున్నా. ప్రతీరోజు సాధన చేయడం వల్ల నా ఆటతీరు మెరుగుపడుతోంది. భవిష్యత్‌లో మంచి క్రికెటర్‌గా ఎదిగి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడాలని నా లక్ష్యం. – గణేశ్‌, నిర్మల్‌

సూర్యవంశీ స్ఫూర్తితో..

చిన్న వయసులోనే సూర్యవంశీ పెద్ద వేదికపై రాణించడం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. అందుకే వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ.. క్రికెట్‌ కోచింగ్‌లో చేరా. క్రమశిక్షణతో సాధన చేస్తే విజయం సాధించగలమనే నమ్మకం ఉంది. ఎప్పటికై నా జాతీయస్థాయిలో ఆడాలన్నదే నా కోరిక.

– రోహన్‌, నిర్మల్‌

జాతీయ స్థాయిలో ఆడాలని..

క్రికెట్‌ అంటే నాకు, మానాన్నకు ఎంతో ఇష్టం. క్రికెట్‌పై మక్కువతో ఎన్నోసార్లు టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. తాను అనుకున్న గోల్‌ క్రికెట్‌లో రీచ్‌ కాలేకపోయాడు. మా ఇద్దరి కోరిక ఒకటే కావడంతో ఎలాగైనా క్రికెట్‌లో జాతీయస్థాయిలో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. రోజు ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్‌ చేస్తున్నా.

– యువన్‌ మోడీ, నిర్మల్‌

భారత జట్టులో చేరాలని..

ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూస్తూ క్రికెట్‌పై మరింత ఆసక్తి పెంచుకున్నా. ప్రస్తుతం బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నా. ఏదో ఒకరోజు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటున్నా. – ఉదయ్‌కిరణ్‌, నిర్మల్‌

అమ్మ కోరిక మేరకు..

నేను ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నా. చదువుతోపాటు ఆటల్లో రాణించాలని అమ్మ కోరిక మేరకు క్రికెట్‌ శిక్షణ శిబిరంలో చేర్పించింది. నెల రోజుల్లో ఆటలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నా. క్రీడల్లో రాణించి, జాతీయస్థాయిలో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తా.

– ఆర్‌.విష్ణుప్రియ, నిర్మల్‌

యువతలో ఆసక్తి పెరిగింది

ప్రస్తుతం యువతలో క్రికెట్‌ పట్ల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లు రాణించడం వల్ల చిన్నారులు, యువకులు పెద్ద సంఖ్యలో శిబిరాలకు వస్తున్నారు. క్రికెట్‌లో విజయం సాధించాలంటే ప్రతిభతో పాటు క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధన చాలా ముఖ్యం. తన లక్ష్యంపై దృష్టి పెట్టి శ్రమిస్తే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించే అవకాశం ఉంటుంది.

– సుదర్శన్‌, క్రికెట్‌ కోచ్‌

క్రమశిక్షణతో సాధన చేయాలి

క్రికెట్‌ అనేది ఆట మాత్రమే కాదు, క్రమశిక్షణ, ఏకాగ్రత, జట్టు భావనను పెంపొందించే క్రీడ. క్రమశిక్షణతోనే సాధన చేస్తే క్రికెట్‌లో ఉన్నత శిఖరాలకు చేరుతాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. చిన్న వయసులోనే సరైన శిక్షణ తీసుకుంటే భవిష్యత్‌లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించే అవకాశాలు ఉంటాయి.

– రామరాజు, క్రికెట్‌ కోచ్‌

Advertisement
 
Advertisement
Advertisement