కడెం: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు నిర్మల్ జిల్లా కడెం మండలంలో సాగవుతున్నాయి. జపాన్ దేశపు మియజాకీ మామిడి సాధారణంగా శీతల వాతావరణంలో సాగవుతుంది. అయితే ఇంతటి ఖరీదైన, అరుదైన మామిడి రకం కడెం మండలం నవాబ్‌పేట్ గ్రామంలోని సత్యం ట్రెడిషనల్ యోగాశ్రమంలో సాగవుతోంది. ఆశ్రమ వ్యవస్థాపకుడు రాపెల్లి సత్యం 2024 జూలైలో కలకత్తా నుంచి ఒక్కో మొక్కకు రూ.10 వేలు వెచ్చించి పది మొక్కలు తెప్పించి ఆశ్రమంలో నాటాడు. వర్మికంపోస్ట్, గోమూత్రం, కషాయాలు, వంటి సేంద్రియ ఎరువులు వేసి మొక్కలను సంరక్షించాడు. రెండేళ్ల తర్వాత మొదటి కాత వచ్చింది. ఒక్కో చెట్టుకు 10 నుంచి 20 కాయాలు కాసాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మియజాకీ పండ్లు కిలోకు రూ.2 నుంచి 2.5 లక్షల వరకు ధర పలుకుతాయి. గతేడాది మరో పది చెట్లను తెప్పించి నాటినట్లు పేర్కొన్నాడు. మియజాకీ పండ్లకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడానికి కారణం అందులో ఉండే ఔషధ గుణాలేనని ఆయన వెల్లడించారు. శరీరానికి రక్షణనిచ్చే రోగ నిరోధకశక్తి అత్యధికంగా ఉంటుందని, శరీరంలోని వ్యర్థాలను (యాంటి ఆక్సిడెంట్స్) తొలగించే ఔషధ గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయన్నారు. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందన్నారు. సాధారణ మామిడి పండ్లకు భిన్నంగా ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందన్నారు. ఏ, బీ, సీ వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయన్నారు.


