‘ప్రత్యేక తెలంగాణలో నష్టపోయింది బీసీలే’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక తెలంగాణలో నష్టపోయింది బీసీలే’

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

ఆదిలాబాద్‌రూరల్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయింది బీసీ వర్గాలేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 18 శాతానికి తగ్గిందన్నారు. బుధవారం బీసీ సంఘ భవనం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుల త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం రాలేదని, 1,200 మంది యువకుల బలిదానాలతో సాకారమైందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. రేవంత్‌ రెడ్డి 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, అటు బీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌ ముఖ్యమంత్రి అంటూ ప్రకటించుకుంటూ పోతే బీసీలకు రాజ్యాధికారం దక్కేదెపుడని ప్రశ్నించారు. బీసీలంతా ఐక్యంగా ఉండి అస్తిత్వం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్‌, గౌరవ అధ్యక్షుడు నర్సాగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement