రవాణాశాఖలో ప్రక్షాళన | - | Sakshi
Sakshi News home page

రవాణాశాఖలో ప్రక్షాళన

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

తాజాగా ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల సర్దుబాటు 12 మంది ఇతర ప్రాంతాలకు.. ఒక్కరే ఇక్కడికి బదిలీ భోరజ్‌ చెక్‌పోస్టు ఎత్తివేత ప్రభావం ఇతర కార్యాలయాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధుల్లోకి మళ్లింపు

సాక్షి,ఆదిలాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అవినీతిని అరికట్టడం, పారదర్శకత పెంచే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా గల రవాణాశాఖ చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ గతేడాది అక్టోబర్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాహనాల రాకపోకలకు భౌతిక తనిఖీలు అవసరం లేదన్న కేంద్రం సూచనల మేరకు అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ శాఖలో పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టారు. జిల్లాలో భోరజ్‌ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును కూడా అప్పట్లోనే ఎత్తివేశారు. ఎంవీఐ, ఏఎంవీఐ పోస్టులు ఇక్కడ పదుల సంఖ్యలో ఉండేవి. రద్దు చేసిన తర్వాత ఆ పోస్టులు ప్రాధాన్యత కోల్పోయాయి. వారికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధులు కేటాయిస్తూ ఇంతకాలం కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా చేపట్టిన బదిలీల్లో వారిని రాష్ట్రంలోని రవాణాశాఖ కార్యాలయాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు మళ్లించారు.

ఇటీవల బదిలీలు ఇలా..

రెండు రోజుల క్రితం రవాణా శాఖలో ఇన్‌స్పెక్టర్లతో పాటు ఆఫీస్‌ సిబ్బంది బదిలీలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు ఎంవీఐలకు ఇతర జిల్లాలకు స్థానచలనం కల్పించారు. ఒకరిని మాత్రం జిల్లాకు కేటాయించారు. ఏడుగురు ఏఎంవీఐలను ఇతర జిల్లాలకు బదిలీ చేయగా, ఇక్కడికి మాత్రం ఎవరిని కేటాయించలేదు. భోరజ్‌ చెక్‌పోస్టు ఎత్తివేసిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఆ పోస్టులు ప్రాధాన్యత కోల్పోయాయి. పదుల సంఖ్యలో వారి సేవలు అవసరం లేకుండా ఉండడంతో ఆ పోస్టులను ఇతర చోటకు మళ్లించారు. అందులో భాగంగానే జిల్లా నుంచి పలువురు ఇన్‌స్పెక్టర్లు బదిలీపై వెళ్లినప్పటికీ కేవలం ఒక్కరు మాత్రమే ఇక్కడికి రానుండటం గమనార్హం.

డీటీవోగా కిశోర్‌బాబు..

రవాణాశాఖ ఆదిలాబాద్‌ కార్యాలయం డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా రవీందర్‌ కుమార్‌ కొనసాగుతున్నారు. కాగా, సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలో ఎంవీఐలుగా విధులు నిర్వహిస్తున్న సీపెల్లి శ్రీనివాస్‌, అల్లి శ్రీనివాస్‌, అశ్వంత్‌ కుమార్‌, ప్రదీప్‌ కుమార్‌, కోల రవిందర్‌లు జిల్లా నుంచి బదిలీ అయ్యారు. సీనియర్‌ ఎంవీఐ సీపెల్లి శ్రీనివాస్‌ ఇన్‌చార్జి డీటీవోగా కొనసాగారు. హన్మకొండలో ఎంవీఐగా పనిచేస్తున్న కిశోర్‌ బాబును జిల్లాకు కేటాయించారు. సీనియర్‌ ఎంవీఐగా ఆయన ఇన్‌చార్జి డీటీవోగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదివరకు జిల్లాలో భోరజ్‌ చెక్‌పోస్టుతో పాటు జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం ఇన్‌స్పెక్టర్‌, ఉద్యోగులు, సిబ్బంది పోస్టులతో రవాణాశాఖలో సందడి కనిపించేది. పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా చెక్‌పోస్టును ఎత్తివేయడం, పలువురు ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను ఇక్కడి నుంచి మళ్లించడంతో ఇదివరకు ఉన్న సందడి తగ్గిపోయింది.

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డీటీవో

కై లాస్‌నగర్‌: జిల్లా రవాణా అధికారి(డీటీవో)గా బాధ్యతలు స్వీకరించిన బి.కిశోర్‌బాబు బుధవారం కలెక్టర్‌ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు రవాణా శాఖ పూర్తి సహకారం అందించాలని కలెక్టర్‌ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement