పింఛన్‌దారుల అథెంటికేషన్‌పై పట్టింపు కరువు విచారణ ప్రక్రియపై వార్డు ఆఫీసర్లు, ఆర్‌పీల నిర్లక్ష్యం రేపటితో ముగియనున్న గడువు
కై లాస్‌నగర్: బోగస్ పెన్షన్‌దారులకు చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పింఛన్‌దారుల లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ జిల్లా కేంద్రంలో నత్తనడకన సాగుతోంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి ఫొటోలను క్యాప్చర్ చేయాల్సిన వా ర్డు అధికారులు, మెప్మా ఆర్పీలు పట్టించుకోవడం లేదు. ప్రత్యేక యూజర్ ఐడీలు కేటాయించి పక్షం రోజులు గడిచినా సదరు అధికారులు ఒకరి ద్దరి ఫొటోలను మాత్రమే క్యాప్చర్ చేస్తున్నారనే వి మర్శలున్నాయి. గడువులోపు ప్రక్రియ పూర్తి చేయకుంటే బోగస్‌గా పరిగణించి పింఛన్లు రద్దు చేసే అవకాశమున్నట్లుగా సెర్ప్ అధికారులు చెబుతున్నారు.
రోజుకు ఒకరిద్దరినే విచారణ
అనర్హుల ఏరివేతపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇందుకోసం క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని ఆదేశించింది. పింఛన్‌దారులు బతికే ఉన్నారనే దాన్ని నిర్ధారించేందు కోసం లైవ్ అథెంటికేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో 18 రోజుల క్రితం మున్సిపల్ పరిధిలోని వార్డు ఆఫీసర్లు, మెప్మా రిసోర్సు పర్సన్లకు కలిపి 131మందికి ప్రత్యేక లాగిన్లు క్రియేట్ చేసి యూజర్ ఐడీలు కేటాయించారు. వీరు లబ్ధి దారుల ఇళ్లకు వెళ్లి వారి ముఖ గుర్తింపు(ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం) ద్వారా వివరాలు ప్రత్యేక యాప్‌లో న మోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో కేవలం 26 మంది మాత్రమే 100–232 మంది పింఛన్‌దారుల అథెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మరో 25 మంది 10 నుంచి 50 మంది వివరాలు మాత్రమే నమోదు చేశారు.32 మంది కేవలం ఒకే ఒక్క అథెంటికేషన్ చేయగా ఆరుగురు ఇద్దరిని, ఐదుగురు ముగ్గురిని, ఇద్దరు నలుగురిని, నలుగురు ఆరుగురిని, పది మంది ఏడుగురిని, మరో ముగ్గురు తొ మ్మిది మందిని విచారించారు. శంకర్, రవనీత అనే ఇద్దరు ఆర్‌పీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా చేపట్టకపోవడం గమనార్హం.
సగం మాత్రమే విచారణ..
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 14,115 మంది చేయూత కింద వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు 8,409 మంది అథెంటికేషన్ మాత్రమే పూర్తిచేశారు. ఇంకా 5,706 మందివి చేయాల్సి ఉంది. ఒక్కోదానికి కేవలం రూ.5 చొప్పున ఇస్తుండటంతో తమకు లాభసాటిగా లేదనే ఉద్దేశంతో ఆర్‌పీలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. వార్డు ఆఫీసర్లలో కొంతమంది బాధ్యతతో ప్రక్రియ చేపడుతుండగా మరికొంతమంది పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రక్రియ నత్తనకడన సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
రేపటిలోగా పూర్తి చేయాలి
చేయూత లబ్ధిదారులకు సంబంధించిన లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను ఈ నెల 5లోపు పూర్తి చేయాల్సి ఉంది. త్వరితగతిన చేపట్టాలనే ఉద్దేశంతో వార్డు ఆఫీసర్లు, ఆర్‌పీలకు ప్రత్యేక లాగిన్ ఐడీలను క్రియేట్ చేశాం. కానీ వారిలో చాలా మంది పట్టించుకోవడం లేదు. గడువులోపు అథెంటికేషన్ చేయించుకోకుంటే పింఛన్ రద్దయ్యే అవకాశముంటుంది.
– జాదవ్ శేష్‌రావు, డీపీఎం


