రైతుల విజ్ఞప్తులు..అధికారుల అనుమతులు పలుచోట్ల పూడికతీతతో సందడి చెరువుల్లో పెరగనున్న నీటి నిల్వ సామర్థ్యం
సాక్షి,ఆదిలాబాద్: రైతులు తమ చేలల్లో సారవంతం పెంచేందుకు ప్రాజెక్టు, చెరువుల మట్టిని పూడిక తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. వాటికి స్పందించిన అధికారులు నిబంధనల మేరకు తవ్వుకునేందుకు అనుమతులిస్తూ, ఎక్కడ ఆ పూడికతీత చేపట్టాలో సూచిస్తున్నారు. దీంతో చెరువుల వద్ద సందడి కనిపిస్తోంది.
రైతుకు లాభం.. పెరగనున్న నీటి నిల్వ
ప్రభుత్వం ఆధ్వర్యంలో పూడికతీత చేపట్టాలంటే ఖర్చుతో కూడుకున్నది. జిల్లా కేంద్రానికి శివారులో ఉండే మావల చెరువులో పూడికతీత చేపట్టాలని గతేడాది యంత్రాంగం ప్రణాళిక రూపొందించినప్పటికీ దాన్ని అంచనా వ్యయం భారీగా ఉండడంతో పనులు ముందడుగు పడలేదు.ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టులు, చెరువుల్లో పేరుకపోయిన పూడికను తీయలేని పరిస్థితి. ప్రస్తుతం పలు గ్రామాల్లో రైతులు చెరువు మట్టి కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు. తమ పంట పొలాల్లో వేసుకుంటామని అధికారులను కోరుతున్నారు. వాటిని పరిగణలోకి ఉన్నతాధికారులు నిబంధనల మేరకు అనుమతిస్తున్నారు. ఇది రైతుకు లాభం చేస్తుండగా, మరోవిధంగా ప్రాజెక్ట్, చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.
బజార్‌హత్నూర్‌లో చెరువు మట్టిని తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులకు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా కొద్ది రోజులుగా పూడిక తీత పనులు ఊపందుకున్నాయి. ఈ మట్టి ద్వారా చేను సారవంతం కానుండగా, పూడిక తీసిన చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరగనుంది.


