అడవితల్లి ఒడి దాటని జీవితాలవి.. గూడేల్లో సాగు, అటవీ ఉత్పత్తుల సేకరణకే పరిమితమైన ఆ గిరిపుత్రులు ఊరు దాటడమే అరుదు.. పట్టణాలకు వెళ్లడం తక్కువే. ఇక నగరాన్ని చూడని వారెందరో.. అలాంటి వారు హైదరా బాద్ సందర్శనతో పులకించిపోయా రు.. ఎత్తైన భవంతులు, విశాలమైన రోడ్లు, చారిత్రక కట్టడాలు, పర్యాటక స్థలాలను సందర్శించి కొత్త బంగారు లోకంలో విహరించారు.
– సాక్షి, ఆదిలాబాద్
ఆదివాసీలకు కొత్త అనుభవాలను ఇవ్వడం, నగర జీవన విధానం పరిచయం చేయడం, ఆత్మవిశ్వాసం పెంచడం, భిన్న సంస్కృతుల మధ్య అవగాహన ఏర్పరచడం, సాంస్కృతిక మార్పిడి, అంతిమంగా గిరపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రివర్స్ టూరిజం పేరిట సరికొత్త ప్రయోగం చేశారు. ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రాంను గడిచిన బుధవారం ఉట్నూర్ మండలం గొండుగూడలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఆ రోజు గొండుగూడ పంచాయతీ పరిధిలోని కొలాంగూడ, మారుతీగూడ, గొండుగూడలకు చెందిన ఆదివాసీలు 250 మంది తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన ఐదు ఏసీ బస్సుల్లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. మంత్రి జూపల్లితో పాటు ఖా నాపూర్ ఎమ్మెల్యే బొజ్జు వారితో కలిసి ప్రయాణం చేశారు. రెండు రోజుల పాటు సాగిన తొలి విడత పర్యటన పూర్తయింది. విమానాశ్రయం, చార్మినార్, హుస్సేన్‌సాగర్, జూపార్క్, శిల్పారామం, బుద్ధవనంలో తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించిన ఆదివాసీలు కొత్త అనుభూతులను తమ మదిలో పదిలపరుచుకున్నారు. ఆ జ్ఞాపకాల తోడుగా తిరిగి గూడేలకు చేరుకున్నారు. రెండో విడతలో దొంగచింత జీపీ పరిధిలోని కుమ్మరికుంట, భీంజీ గూడ వాసులు సుమారు 500 మంది 11 బస్సుల్లో శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ఇలా ఎక్కువ మంది ఆదివాసీలను నగర సందర్శన చేయించాలనే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతుంది.
బుద్ధవనంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
కుటుంబ సభ్యులతో ఆదివాసీలు
హైదరాబాద్ సందర్శనకు బయలుదేరిన ఆదివాసీ మహిళలతో బస్సులో ముచ్చటిస్తున్న మంత్రి జూపల్లి
జూపార్కులో జంతువులను
చూస్తూ ఫొటో తీస్తున్న ఆదివాసీలు


