జిల్లాలోని ఓ ఏజెన్సీ మండలానికి చెందిన నిరుద్యోగ అభ్యర్థిని పట్టణంలోని ఓ పోలీస్ శిక్షణ అకాడమీలో చేరింది. ఆమె నుంచి నిర్వాహకులు ఉద్యోగం గ్యారెంటీ పేరిట ఏడాదికి రూ.లక్షకు పైగా వసూలు చేశారు. అయితే ఆమెకు ఉద్యోగం రాకపోవడంతో ఆ కుటుంబానికి అప్పులే మిగిలాయి.
జిల్లా కేంద్రంలోని శిక్షణ అకాడమీ ప్రకటనను సోషల్ మీడియా ద్వారా చూసిన వేరే జిల్లాకు చెందిన ఓ నిరుద్యోగ అభ్యర్థి అందులో అడ్మిషన్ తీసుకున్నాడు. తీరా చూస్తే సదుపాయాలు లేవని, ఫ్యాకల్టీ లేరని తెలుసుకొని మోసపోయినట్లు గ్రహించాడు. ఫీజు వాపస్ చేయమని అడితే ఇచ్చేందుకు నిర్వాహకులు నిరాకరించారు. చేసేది లేక అతడు ఇంటి బాటపట్టాడు.
వీటిలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు : 600 (సుమారు)
ఆదిలాబాద్: నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పలువురు శిక్షణ పేరిట వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తమ అకాడమీ, కోచింగ్ సెంటర్లో చేరితే జాబ్ గ్యారెంటీ అంటూ నమ్మిస్తూ వేలాది రూపాయలు నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఈ కేంద్రాలపై అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
అనుమతులు లేకుండానే..
అకాడమీ, కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే మున్సిపాలిటీ, విద్యాశాఖ, కార్మిక శాఖ, అగ్నిమాపక శాఖల అనుమతులు తప్పనిసరి. అలాగే కోచింగ్ సెంటర్ వార్షిక ఆదాయం రూ.20 లక్షలు దాటితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే ఇవేవి లేకుండానే క్షేత్రస్థాయిలో పలువురు కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారు. వీటిపై చర్యలు చేపట్టాల్సిన అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
నిరుద్యోగులకు బురిడీ..
జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు. ఇటీవల పోలీస్‌శాఖ నిర్వహించిన జాబ్ మేళాకు భారీగా హాజరు కావడమే ఇందుకు నిదర్శనం. దీనిని ఆసరాగా చేసుకుంటున్న అకాడమీల నిర్వాహకులు నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాయి. రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ అరకొర వసతులతో కాలవ వెల్లదీస్తున్నారు. మరికొందరు నిరుద్యోగ అభ్యర్థుల సిర్టిఫికెట్లను తమవద్దే ఉంచుకొని, ఉద్యోగం వస్తే డబ్బులు చెల్లించాక ఇస్తామంటూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. జాబ్ రాకున్నా కొందరు సర్టిఫికెట్లను అడ్డు పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతుండడం సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం..?
ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారాలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అయితే జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ కోచింగ్‌సెంటర్‌ను పరోక్షంగా నడుపుతుండడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కొంతమందికి కోచింగ్ ఇచ్చిన ఆయన ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా పట్టణ నడిబొడ్డున కోచింగ్ సెంటర్ నడుపుతుండడం విమర్శలకు తావిస్తోంది. పలు సందర్భాల్లో ఆ అకాడమీని ప్రమోట్ చేయడం, అడ్మిషన్లు తీసుకోవాలంటూ ప్రచారం చేయడం ఈ విషయాలకు మరింత బలం చేకూరుస్తోంది. సదరు ఉద్యోగి కోచింగ్ సెంటర్ పేరిట రూ. లక్షల్లో సంపాదించడం ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.
జిల్లాలోని కోచింగ్ సెంటర్లు: 07
అమలుకు నోచుకోని మార్గదర్శకాలు
కోచింగ్ సెంటర్లు, వసతిగృహాలను కట్టడి చేసేందుకు సరైన నిబంధనలు లేకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీచేసినప్పటికీ ఇవి ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు చట్టం తీసుకువచ్చింది. ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక చట్టం చేస్తే సెంటర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు నిరుద్యోగులు మోసపోకుండా అడ్డుకోవచ్చు.


