రెండేళ్ల తర్వాత ప్రభుత్వ ఆమోదం తాజాగా టీయూఎఫ్‌ఐడీసీ నుంచి ఉత్తర్వులు విలీన కాలనీల్లో మెరుగుపడనున్న వసతులు
కైలాస్‌నగర్: గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి మంజూరైన రూ.46.70 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధుల్లో రూ.30కోట్లతో కూడిన అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. రూ.10.50 కోట్ల పనులను ఇది వరకు రెండు విడతల్లో ప్రారంభించగా మూడో విడతకు రెండేళ్ల తర్వాత గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఈ నిధులతో విలీన కాలనీల్లో 38 పనులు చేపట్టేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర టీయూఎఫ్‌ఐడీసీ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టి.కే శ్రీదేవి గత నెల 30న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక విలీన కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి.
ఏం జరిగిందంటే..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీకి టీయూఎఫ్‌ఐడీసీ కింద రూ.46.70 కోట్ల నిధులు మంజూరు చేసింది. వీటితో పట్టణంలోని వివిధ కాలనీల్లో 49 పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. పనులు చేపట్టడమే తరువాయి అనుకున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో పాటు ఎమ్మెల్యేగా ఎన్నికై న పాయల్ శంకర్ ఈ పనులను సమీక్షించి మళ్లీ ప్రతిపాదనలు పంపించాలని అధి కారులను ఆదేశించారు. తదనుగుణంగా అధికారులు మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. రెండో సారి ప్రతిపాదనల మేరకు తొలి విడతలో రూ.5.40 కోట్ల విలువైన ఆరు పనులకు, రెండో విడతలో రూ.5.10 కోట్ల విలువైన 13 పనులకు గతంలోనే టీయూఎఫ్‌ఐడీసీ నుంచి ఆమోదం లభించింది. దీంతో ఆయా పనులను ప్రారంభించారు. అందులో కొన్ని ఇప్పటికే పూర్తవగా మరికొన్ని కొనసాగుతున్నాయి. తాజాగా మంజూరైన రూ.30 కోట్లతో ఆయా పనులు చేపట్టేందుకు టీయూఎఫ్‌ఐడీసీ నుంచి ఆమోదం లభించింది. కాగా, ప్రతిపాదిత నిధుల్లో మరో రూ.6.20కో ట్లు మంజూరు కావాల్సి ఉంది.
మెరుగుపడనున్న వసతులు..
పట్టణంలో మావల, బట్టిసావర్‌గాం, అనుకుంట, రాంపూర్ గ్రామ పంచాయతీల్లోని పలు కాలనీలు విలీనమై ఏడేళ్లు గడిచినా ఇప్పటికి కనీస వసతులకు నోచుకోవడం లేదు. తాజాగా ఆమోదించిన నిధులతో బంగారుగూడ, బెల్లూరి, కేఆర్‌కే కాలనీ, బాలాజీనగర్, కుమ్మరికుంట, దుర్గానగర్, కో జాకాలనీ, శంకర్‌గుట్ట, మణిపూర్, రాంనగర్, న్యూ హౌసింగ్ బోర్డు, 170 సర్వేనంబర్, అగ్రజాటౌన్‌షిప్, టైలర్స్‌కాలనీ, సుభాష్‌నగర్, టీచర్స్‌కాలనీ, దస్నాపూర్, దోబీకాలనీ, పోలీస్‌కాలనీ, రాంపూర్, కై లాస్‌నగర్, హనుమాన్ నగర్ కాలనీల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కల్వర్టులు, డ్రెయినేజీలను నిర్మించనున్నారు. రూ.30 కోట్లలో రూ.27కోట్లను ఈ కాలనీల్లోనే వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని విలీన కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి.
ఇది ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఏడేళ్ల క్రితం విలీనమైన టీచర్స్ కాలనీలోని డ్రెయినేజీ పరిస్థితి. కాలువల నిర్మాణం లేకపోవడంతో మురుగునీరంతా ఇలా రోడ్డుపై ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది. అయితే ఇలాంటి కాలనీల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో త్వరలోనే ఈ పరిస్థితి దూరం కానుంది.
పట్టణ అభివృద్ధికి దోహదం
రెండేళ్ల క్రితం పంపిన ప్రతిపాదనలకు సంబంధించి రూ.30 కోట్లతో పనులు చేపట్టేందుకు ఆమోదిస్తూ టీయూఎఫ్‌ఐడీసీ ఉన్నతాధికారుల నుంచి ఇటీవల ఉత్తర్వులు వచ్చాయి. త్వరలోనే ఈ నిధులతో విలీన కాలనీల్లో అభివృద్ధి పనులు చేపడతాం. మరో రూ.6కోట్ల వరకు రావాల్సి ఉన్నాయి. అవి కూడా విడుదలైతే పట్టణంలో మరింత అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.
– బండారి అనూష, మున్సిపల్ చైర్‌పర్సన్


