సీఎం సభ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

సీఎం సభ విజయవంతం

Apr 8 2026 8:14 AM | Updated on Apr 8 2026 8:14 AM

● డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌

కై లాస్‌నగర్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బజార్‌హత్నూర్‌ మండలం పిప్రి గ్రామంలో సోమవారం నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహిరంగసభ విజయవంతమైందని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ నరేశ్‌జాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సభను విజయవంతం చేసేందుకు సహకరించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డితో పాటు జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భారీగా తరలివచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సభ వేదికగా సీఎం ఆదిలాబాద్‌ అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారన్నారు. జిల్లాకు యూనివర్సిటీ, ఇంజినీరింగ్‌ కళాశాలను త్వరలోనే మంజూరు చేసి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని ఇది విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందన్నారు. బోథ్‌ నియోజకవర్గ వరప్రదాయని కుప్టి ప్రాజెక్ట్‌ పనులు, అలాగే ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సీఎం ఇచ్చిన మాట జిల్లా రైతాంగానికి కొండంత అండనిస్తుందని తెలిపారు. జూన్‌ 2 లోపు ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఆదిలాబాద్‌–ఆర్మూర్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లాలో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తామని, పర్యాటక రంగంలో జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలుపుతామని సీఎం హామీ ఇచ్చారని వివరించారు. ఇందులో పార్టీ నాయకులు గండ్రత్‌ సుజాత, సాజిద్‌ఖాన్‌, అల్లూరి సంజీవరెడ్డి బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి, బాలురి గోవర్దన్‌రెడ్డి, బండారి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement