
విద్యాశాఖ అప్రతిష్టపాలు
ఉద్యోగుల సస్పెన్షన్లు, సరెండర్లతో విమర్శలపాలు రెగ్యులర్ జిల్లా అధికారి లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యం గాడితప్పిన పాలన.. లోపించిన పర్యవేక్షణ
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా విద్యాశాఖ ఇటీవల అప్రతిష్ట మూటగట్టుకుంటుంది. ఆ శాఖలో సస్పెన్షన్లు, సరెండర్లు, టర్మినేట్, మెమోల జారీ.. ఇలా వరుస ఘటనలు కారణమని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పర్యవేక్షణ లోపమనే చర్చ సాగుతోంది. కొన్నేళ్లుగా జిల్లాకు రెగ్యులర్ విద్యాశాఖాధికారి కరువయ్యారు. దీంతో పలువురు ఉద్యోగులు, కొంత మంది ప్రధానోపాధ్యాయులు అక్రమాలకు తెర లేపుతున్నారు. పాఠశాలలో విద్యార్థులపై కొందరు గురువులు అసభ్యంగా ప్రవర్తిస్తూ కటకటాల పాలవుతున్నారు. పౌష్టికాహారం మాట పక్కనబెడితే.. కనీసం నా ణ్యమైన విద్యాబోధన సైతం అందకుండా పోతుందనే విమర్శలున్నాయి.
అక్రమాల జోరు..
విద్యాశాఖలో ప్రతీ పనికి ఎంతో కొంత ముట్టజెబితే కానీ కొంత మంది ఉద్యోగులు ఫైళ్లు కదలనివ్వడం లేదని పలువురు చెబుతున్నారు. రెగ్యులర్ డీఈవో లేకపోవడం, ఇన్‌చార్జి అధికారి స్థానికంగా ఉండకపోవడంతో వారి ఆగడాలు మితిమీరుతున్నట్లు తెలుస్తోంది. కొంత మంది ప్రధానోపాధ్యాయులు సైతం పాఠశాల నిధులను దుర్వినియోగం చేస్తున్నా రు. విద్యాభివృద్ధి కోసం కేటాయించాల్సిన వాటిని సొంతగా వినియోగించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గాడితప్పిన పాలన..
జిల్లాకు ఐదారేళ్లుగా రెగ్యులర్ విద్యాధికారి కరువయ్యారు. ఇటీవల ఇన్‌చార్జి అధికారి ఉద్యోగ విరమణతో వయోజన విద్యాశాఖ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన పనితీరు సరిగా లేకపోవడంతో ఆయనను తప్పించారు. ఐటీడీఏ పీవోకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే సదరు అధికారికి కీలకమైన ఐటీడీఏ శాఖ ఉండడంతో పూర్తిస్థాయిలో జిల్లా విద్యాశాఖపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. దీంతో పాలన గడితప్పినట్లు తెలుస్తోంది. ఫేషియల్ అటెండెన్స్ ఉన్నప్పటికీ కొంత మంది సమయపాలన పాటించడం లే దు. కొందరు మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను ప ర్యవేక్షించాల్సి ఉండగా, కార్యాలయానికే పరిమితమవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతుంది. పదో తరగతికి సంబంధించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యా శాఖాధికారులు గత మంగళవారం ఆ దేశాలు జారీ చేస్తే కొన్ని పాఠశాలల్లో మాత్రమే ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే కేజీబీవీల్లో వి ద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. మెనూలో కోత విధిస్తూ కొంత మంది ఎస్‌వోలు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల నాణ్యమైన భోజనం అందక విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మె నూ ప్రకారం అందడం లేదు. సర్కారు బడుల బా గు కోసం ప్రభుత్వం చర్యలు చేపడితే కొంత మంది ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల తీరుతో విద్యాశాఖకు చెడ్డపేరు వస్తోంది.
ఈ విషయమై విద్యా శాఖ ఏడీ వేణుగోపాల్ గౌడ్‌ను వివరణ కోరగా, ఇటీవల నార్నూర్ మండలంలోని కేజీబీవీలో జరిగిన సంఘటనపై సెక్టోరియల్ అధి కారి ఉదయశ్రీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని తెలిపారు. అలాగే ఇంద్రవెల్లి ప్రధానోపాధ్యాయుడిని ఆర్‌జేడీకి కలెక్టర్ సరెండ్ చేసినట్లు వివరించారు.