
అడ్డుపడితే గుణపాఠం చెబుతాం
ఆదిలాబాద్‌రూరల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్‌కు ఎవరు అడ్డుపడుతున్నారో తమకు తెలుసని, రాబో యే రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు అన్నారు. బీసీ రిజర్వేషన్‌కు వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషనర్ల దిష్టిబొమ్మతో శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌక్ వద్ద దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తొపులాట చోటుచేసుకుంది. అనంతరం రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు అసెంబ్లీలో జీవో చేసి గవర్నర్ వద్దకు పంపితే అక్కడ పెండింగ్‌లో ఉందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్‌తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే జీర్ణించుకోలేక కొందరు హైకోర్టులో కేసు వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరున్నారో బీసీలకు తెలుసని, తగిన సమయంలో వారికి గుణపాఠం తప్పదన్నారు. రిజర్వేషన్ అమలయ్యే దాకా పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, నాయకులు అంజయ్ కుమార్, శ్రీనివాస్, అశోక్, రాము, చందు, సామల ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.