
‘బీసీ రిజర్వేషన్లపై సీఎంకు చిత్తశుద్ధి ఏది’
ఆదిలాబాద్: బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామా చేస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. 42శాతం బీసీ రిజర్వేషన్లపై తాను అసెంబ్లీలో చర్చించానని, రిజర్వేషన్ అమలులో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించానని గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలే మహారాష్ట్ర, కర్ణాటకలో వచ్చినట్లు తాను ఉదహరించానని వివరించారు. 42శాతం రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్ బీసీలను ఆశల పల్లకిలో ఊరేగించిందని, ఏమీ కాకముందే కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగా జీవో తీసి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేసేందుకే కుట్ర పన్నిందని మండిపడ్డారు. రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసిందని ఆరోపించా రు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని, అ ప్పటివరకు బీసీల పక్షాన పోరాడుతామని వెల్లడించారు. ఆయన వెంట నాయకులు లాలా మున్నా, సంతోష్, మయూర్ చంద్ర, దయాకర్, విజయ్, దినేశ్ మాటోలియా, భీమ్‌సేన్‌రెడ్డి, రాందాస్, అశోక్, సన్నీ, విశాల్, రమేశ్ తదితరులున్నారు.