
ముగిసిన ‘మీనం’ టెండర్
కై లాస్‌నగర్: కులవృత్తిపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ ప్రక్రియ ముగిసింది. జిల్లాకు అవసరమైన చేప పిల్లలను సరఫరా చేసేందు కోసం కరీంనగర్‌కు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేశారు. వాటికి మత్స్యశాఖ ఈ నెల 12న ఆమోదం తెలిపింది. త్వరలోనే వారి చేపల చెరువులను పరిశీలించి సరఫరాకు ఉన్న అవకాశాలపై నివేదిక అందించాల్సిందిగా జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రత్యేక కమిటీ త్వరలోనే కరీంనగర్‌లో పర్యటించనుంది. అయితే చేప పిల్లల సరఫరాలో అక్రమాలకు తావు లేకుండా ఉండాలంటే ఈ క్షేత్రస్థాయి పరిశీలనే కీలకం కానుంది. ప్రక్రియ సజావుగా సాగితే ఈ నెలాఖరులోగా చెరువుల్లో చేప పిల్లలను వదిలే అవకాశముంది.
రెండు బిడ్లు దాఖలు..
జిల్లాలో ఈ ఏడాదికి గాను కోటి 16లక్షల చేప పిల్లలను ప్రాజెక్టులు, చెరువుల్లో వదిలేలా మత్స్యశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. వీటి సరఫరా కోసం టెండర్లను పిలిచారు. మొదటిసారి కేవలం ఒకే బిడ్ దాఖలైంది. దీంతో మరోసారి ఆహ్వానించగా కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువైంది. ఈ క్రమంలో ఈ ఏడాది చేప పిల్లల సరఫరా ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తిరిగి ఈనెల 12న మూడోసారి టెండర్లు పిలువగా మరో బిడ్ దాఖలైంది. మొత్తంగా జిల్లాకు అవసరమైన చేప పిల్లలను సరఫరా చేసేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు బిడ్లను దాఖలు చేయగా మత్స్యశాఖ వాటికి ఆమోదం తెలిపింది. ఈనెల 16లోపు క్షేత్రస్థాయిలో వారికి సంబంధించిన చేపల చెరువులను ప్రత్యేక కమిటీ పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించింది. అయితే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో పరిశీలన కమిటీ ఇంకా నియామకం కాలేదు. కమిటీ నియామకమైన తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. సదరు కాంట్రాక్టర్లు టెండర్‌లో చెప్పినట్లుగా చేపల చెరువులు ఉన్నాయా, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, అందులో చేప పిల్లలు ఉన్నాయా, జిల్లాకు సరిపడా వారు సరఫరా చేయగలుగుతారా అనే విషయాలను పరిశీలిస్తుంది. వారిచ్చే నివేదిక ఆధారంగానే ఉన్నతాధికారులు కాంట్రాక్టర్‌కు సీడ్ సరఫరాకు అనుమతి ఇవ్వనున్నారు.
పారదర్శకంగా వ్యవహరిస్తాం
చేపల చెరువుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ నియమించాల్సి ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకు కమిటీని సోమవారం ఏర్పాటు చేస్తాం. మంగళ, బుధవారాల్లో కరీంనగర్‌లో పర్యటించి టెండర్ దాఖలు చేసిన కాంట్రాక్టర్ల చెరువులు, చేప పిల్లల నిల్వ, సరఫరా సామర్థ్యం వంటి అంశాలను క్షేత్రస్థాయికి వెళ్లి పక్కాగా పరిశీలిస్తాం. పారదర్శకమైన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం. ఆరోగ్యకరమైన సీడ్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూస్తాం.
– టి.భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి
జిల్లాలో..
మత్స్యపారిశ్రామిక సంఘాలు : 107
ఆయా సంఘాల్లోని సభ్యులు: 5040
మొత్తం చెరువులు : 224
చేప పిల్లల పంపిణీ లక్ష్యం : 1.16కోట్లు
35–40 ఎంఎం సైజ్ : 83 లక్షలు
90–100 ఎంఎం సైజ్ : 33లక్షలు