బెల్లంపల్లిరూరల్: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టు ఒడిశా (ఏవోబీ) రాష్ట్ర టెక్నికల్ టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు జాడి వెంకటి అలియాస్ విమల్ అలియాస్ సురేష్ అలియాస్ మంగన్న (56) అంత్యక్రియలు ఆదివారం చంద్రవెల్లిలో ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. గ్రామ శివారు చేరుకున్న మృతదేహానికి నివాళులర్పించేందుకు ప్రజాసంఘాలు, అమరవీరుల బంధుమిత్రుల సంఘం, వివిధ పార్టీల నాయకులు, జనం భారీగా తరలివచ్చారు. ఎర్రని జెండాతో బాణాసంచా కాల్చుతూ విప్లవగీతాలు పాడుతూ నృత్యాలు చేస్తూ స్వగృహానికి తీసుకువచ్చారు. సంఘాల నాయకులు మృతదేహం వద్ద ఎర్రని జెండా కప్పి, పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. మృతదేహాన్ని చూసి కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామ శివారులోని వెంకటికి చెందిన స్థలం వరకు అంతిమయాత్ర చేపట్టారు. అమరుడా లాల్ సలామ్, జోహార్ కామ్రేడ్ వెంకటి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చెల్లెలు రామటెంకి సుజాత అన్న వెంకటికి తలకొరివి పెట్టింది. అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి, కార్యదర్శి శాంతక్క, సభ్యులు సత్తక్క, కవిత, అనిత, రైతు హ క్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్, జిల్లా కార్యదర్శి రామడగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు వెంకటస్వామి, పూర్ణిమ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చాంద్‌పాషా, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు ప్రవీణ్, మాజీ జెడ్పీటీసీ రాంచందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు, కాంగ్రెస్ నాయకులు శంకర్, స్వామి, ప్రజా కళా మండలి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆడెపు సమ్మయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, అభిమానులు ఆయనకు విప్లవ జోహర్లు అర్పించారు.
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
ఆపరేషన్ కగార్ పేరిట బూటకపు ఎన్‌కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని అమవీరుల బంధుమిత్రల కమిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి, రాష్ట్ర కార్యదర్శి శాంతక్క డిమాండ్ చేశారు. బూటకపు ఎన్‌కౌంటర్‌పై కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదన కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలన్నారు.
జోహార్ వెంకటి