
‘చలో భద్రాచలం’ విజయవంతం చేయండి
ఆదిలాబాద్‌రూరల్: ఈనెల 28న నిర్వహించే చలో భద్రాచలం కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 9 తెగల ఆదివాసీలు విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ సంఘాల రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సోయం బాపూరావు, జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని చలో భద్రాచలం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోయం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ జేఏసీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ, ఆ తర్వాత ఢిల్లీలో సభ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో 9 తెగల సంఘాల నాయకులు, అడ్వొకేట్, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నర్సాపూర్(జి): మండలంలోని రాంపూర్ గ్రామం 61వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరికి గాయాలయయ్యాయి. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు.. భైంసా పట్టణంలోని రాహుల్‌నగర్‌కు చెందిన రోహిత్ (21), చంద్రకాంత్‌లు బైక్‌పై నిర్మల్ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో అతివేగంగా, జాగ్రత్తగా నడుపుతూ నిలిపి ఉన్న ఎడ్లబండిని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో రోహిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు 108 వాహనంలో నిర్మల్ తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు. చంద్రకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.
బైక్ దొంగ రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్‌లో బైక్ దొంగలించిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు. పట్టణానికి చెందిన నిసార్ హుస్సేన్ తన ఆరోగ్యం బాగాలేకపోవడంతో శనివారం రిమ్స్‌లో వైద్యం కోసం వెళ్లి బైక్‌ను పార్కింగ్ చేశాడు. తిరిగివచ్చేసరికి బైక్ కనిపించలేకపోవడంతో బాధితుడు టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన విజయ్‌కుమార్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
దాడి ఘటనలో ఐదుగురు అరెస్ట్
తాండూర్: మండల కేంద్రానికి చెందిన తాళ్లపల్లి సృజన్‌గౌడ్‌పై దాడి చేసిన ఘటనలో ఐదుగురి యువకులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఈనెల 5న రాత్రి తాండూర్ ఐబీలో తనపై దాడి చేసి గాయపర్చారని సృజన్‌గౌడ్ ఫిర్యాదు మేరకు సుభద్ర కాలనీకి చెందిన అనిల్, సాయి, రాజు, నరేశ్, హరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిఖిల్ పరారీలో ఉన్నాడని తెలిపారు.