
వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్: వైద్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యూనైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపాల్ అన్నారు. జిల్లా కేంద్రంలో యూనియన్ తృతీయ మహాసభలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయిస్తుందని, పనికి తగ్గ వేతనం చెల్లించడం లేదని పేర్కొన్నారు. ఆధార్ బేస్డ్ అటెండెన్స్ తొలగించాలని డిమాండ్ చేశారు. రెండో, అర్బన్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఉద్యోగుల జీవోను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. రిమ్స్ ఉద్యోగుల వేతనాల్లో కాంట్రాక్టర్ కోత విధించకుండా నేరుగా వేతనాలు చెల్లించేలా చూడాలని కోరారు. ఇందులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశ్, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశన్న, కిరణ్, స్వామి, పుష్పల, విద్య, నాగనాథ్, సురేందర్, శ్రీనివాస్, తులసీ, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.