ఆగని నెత్తుటి త్యాగాల ధార | - | Sakshi
Sakshi News home page

ఆగని నెత్తుటి త్యాగాల ధార

Sep 15 2025 8:43 AM | Updated on Sep 15 2025 8:43 AM

ఆగని

ఆగని నెత్తుటి త్యాగాల ధార

విప్లవోద్యమంలో అసువులు బాస్తున్న బెల్లంపల్లి బిడ్డలు ప్రజల కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పిస్తున్న వైనం నిరుపేద, కార్మిక కుటుంబాల వారే..

బెల్లంపల్లి: విప్లవోద్యమ చరిత్రలో బెల్లంపల్లికి ఎంతో ప్రత్యేకత ఉంది. పోరాటాల పురిటిగడ్డగా ప్రసిద్ధిగాంచింది. బొగ్గు గనుల క్షేత్రమైన ఈ ప్రాంతం నుంచి ఎందరో యువకులు విప్లవోద్యమంలో చేరి ఏళ్ల తరబడి నుంచి అసువులు బాస్తున్నారు. నేటికీ అదే ఒరవడి కొనసాగుతోంది. విప్లవమే జీవితాశయంగా ఎంచుకుని సాయుధ గెరిల్లా పోరాట పంథాలో సాగుతూ పోలీసు ఎదురుకాల్పులు, అనారోగ్య సమస్యలతో ఒక్కొక్కరుగా కన్నుమూస్తున్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తూ త్యాగాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. ఆ అమరుల నెత్తుటి త్యాగాలతో నల్ల నేల ఎరుపు వర్ణాన్ని పులుముకుంటోంది. అజ్ఞాతంలోకి వెళ్లి దండకారణ్యానికి ఉద్యమబాటలు వేసిన విప్లవకారుల్లో ఈ ప్రాంత అమరుల భాగస్వామ్యం ఎంతో ఉంది. త్యాగాల నెత్తుటి సాళ్లలో మొలకెత్తిన ఆ విప్లవ బీజాలు ప్రస్తుతం కానరాకుండా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దౌర్జన్యాలు, దాష్టీకాలు సహించలేక..

విప్లవ పోరాటానికి ఆకర్శితులైన యువకుల్లో అత్యధిక మంది నిరుపేద, కార్మిక బిడ్డలే. సింగరేణి కార్మికులపై గని అధికారులు సాగిస్తున్న వేధింపులు, దోపిడీ, దౌర్జన్యాలు, అట్టడుగు వర్గాల ప్రజలు, బస్తీల్లో మహిళలపై గూండాలు సాగిస్తున్న దాష్టీకాలకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ప్రజాకంఠకులుగా మారిన గూండాలు, రౌడీలను అంతమొందించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ) తరపున గని అధికారుల దోపిడీ, దౌర్జన్యాలు ఎదిరించి విప్లవమార్గంలో పయనించారు. పీపుల్స్‌వార్‌, సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) నిర్మాణంలో కార్మిక, నిరుపేద వర్గాల బిడ్డలు భాగస్వాములై రహస్య జీవితంలోకి వెళ్లారు.

ఆద్యులు ఆ ముగ్గురు

సింగరేణి కార్మిక బిడ్డలైన గజ్జెల గంగారాం, పెద్ది శంకర్‌, కటకం సుదర్శన్‌ విద్యార్థి దశలో రాడికల్‌ విప్లవోద్యమాలకు ఆకర్శితులయ్యారు. విప్లవోద్యమ చరిత్రలో వీరు ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. వీరి అడుగుజాడల్లో ఎందరో యువకులు పోరు బాటపట్టారు. దశాబ్దాలుగా రహస్య జీవితం గడుపుతూ ఎన్‌కౌంటర్‌లో అమరులవుతున్నారు. ఎక్కడ జరిగిన అక్కడ బెల్లంపల్లి బిడ్డ ఎవరో ఒకరు నేలకొరగడం ఈ ప్రాంత ప్రజలను, విప్లవ సానుభూతిపరులను తీవ్రంగా కలిచివేస్తోంది.

తొలి అమరుడు పెద్ది శంకర్‌

బెల్లంపల్లి విప్లవకారుల్లో తొలి అమరుడిగా పెద్ది శంకర్‌ చరిత్ర పుటలకెక్కారు. 1980లో మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా మోయిన్‌బిన్‌పేట వద్ద జరిగిన పోలీసు ఎదురుకాల్పుల్లో ఆయన మృతి చెందాడు. ఆయుధాలను పరీక్షిస్తుండగా వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గ్రేనేడ్‌ పేలి 1981లో గజ్జెల గంగారాం అమరుడయ్యాడు. 1985లో పులి మధునయ్య సిర్పూర్‌ తాలూకా లోడ్‌పల్లి వద్ద, 1987లో బుయ్యారం వద్ద ముద్దు నారాయణ, ఈట శంకర్‌, మురళీ, 1999లో నస్పూర్‌ కాలనీలో సికాస అగ్రనేత గెల్లి రాజలింగు, 2000లో తిర్యాణి మండలం లోవగుట్ట వద్ద ఇద్దరు ఆదివాసీ దళసభ్యులతోపాటు శనిగారపు రాంచందర్‌, 2002లో పులిపాక లక్ష్మణ్‌ను హైదరాబాద్‌లో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. గజ్జెల గంగారాం సోదరి గజ్జెల సరోజ దండకారణ్యంలో అనారోగ్యంతో 2013లో అమరురాలైంది. అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడి స్థాయికి ఎదిగిన కటకం సుదర్శన్‌ 2023 మే 31న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దక్షిణ్‌ బస్తర్‌ అడవుల్లో అనారోగ్య సమస్యలతో కన్నుమూశాడు. 2024లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కాసరవేణి రవి మృతి చెందగా తాజాగా ఈనెల 11న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం గరియాబండ్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన జాడి వెంకటి అసువులు బాశాడు.

ఆగని నెత్తుటి త్యాగాల ధార1
1/6

ఆగని నెత్తుటి త్యాగాల ధార

ఆగని నెత్తుటి త్యాగాల ధార2
2/6

ఆగని నెత్తుటి త్యాగాల ధార

ఆగని నెత్తుటి త్యాగాల ధార3
3/6

ఆగని నెత్తుటి త్యాగాల ధార

ఆగని నెత్తుటి త్యాగాల ధార4
4/6

ఆగని నెత్తుటి త్యాగాల ధార

ఆగని నెత్తుటి త్యాగాల ధార5
5/6

ఆగని నెత్తుటి త్యాగాల ధార

ఆగని నెత్తుటి త్యాగాల ధార6
6/6

ఆగని నెత్తుటి త్యాగాల ధార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement