
ఇద్దరు దొంగల అరెస్ట్
బెల్లంపల్లిరూరల్: మండలంలోని గురిజాల రైతువేదికలో జూలై 3న జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. ఎట్టకేలకు రెండు నెలలకు దొంగలను పట్టుకున్నారు. పోలీసుస్టేషన్‌లో బెల్లంపల్లి రూరల్ సీఐ చందవోలు హనోక్ ఆదివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. గురిజాల రైతు వేదికలో రూ.1.90 లక్షల విలువ గల వీడియో కాన్ఫరెన్స్‌కు ఉపయోగించే ఎల్‌ఈడీ టీవీ, ఇతర సామగ్రి చోరికి గురైనట్లు వ్యవసాయ అధికారులు తాళ్లగురిజాల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు. కన్నెపల్లి మండలం జన్కాపూర్‌కు చెందిన మహమ్మద్ నసీమ్ బేగ్, బెల్లంపల్లి అశోక్‌నగర్‌కు చెందిన వర్మ శైలేష్‌లు జూలై 3న అర్థరాత్రి ఆటోలో వచ్చి బండరాయితో తాళం పగులగొట్టి ఎల్‌ఈడీ టీవీ, సౌండ్ బాక్స్‌లు, సీపీయూ, ఆంఫ్లీఫయార్, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఆ సామగ్రిని బెల్లంపల్లిలో విక్రయించేందుకు వస్తున్నారు. తాళ్లగురిజాల పోలీసులు శనివారం వాహనాల తనిఖీలో ఆటోలో ఎల్‌ఈడీ టీవీ, సామగ్రి అనుమానస్పదంగా కనిపించడంతో సదరు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఇద్దరు నిందితులను బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. తాళ్లగురిజాల ఎస్సై బండి రామకృష్ణ, ఏఎస్సై అలీ, సిబ్బంది అరుణ్, మురళీ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.