breaking news
YSR Engineering college
-
ఆ నియామకాలు అక్రమం అయినా... జీతాలు పెంపు
♦ త్రిసభ్య కమిటీ నివేదిక బుట్టదాఖలు ♦ వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో 23 మందికి మేలు ♦ మాజీ ఎమ్మెల్యే అండా దండా..! ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరులోని వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 23 మంది నియామకాలు అక్రమంగా జరిగాయని యోగివేమన విశ్వవిద్యాలయం నియమించిన త్రిసభ్య కమిటీ నిర్థారించింది. కాలేజీలో నియామకాలపై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో 2013లో టీవీ.కృష్ణారెడ్డి సారధ్యంలో త్రిసభ్య కమిటీ నియమించారు. కాగా అయినా వారందరికీ జీవో నంబర్- 3 అడ్డు పెట్టుకుని ఈ ఏడాది నుంచి జీతాలు కూడా పెంచేశారు. ఏమి జరిగింది పొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ద్వారా 32 మంది నియామకానికి ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 26వ తేదీ జీవో నంబర్-287 జారీ చేసింది. అయితే వ ర్సిటీ ఉన్నతాధికారులు ఈ జీవోకు విరుద్ధంగా, ప్రభుత్వ నియమాలు పాటించకుండా దినసరి ప్రాతిపదికన 23 మందిని నియమించుకున్నారు. అయితే నోటిఫికేషన్ ఇవ్వకపోవడం తోపాటు రోస్టర్ పద్ధతి కూడా పాటించలేదు. అధికార పార్టీకి చెందిన ఓ నేత ఒత్తిడితో యూనివర్సిటీ అధికారులు ఈ నియామకాలు సాగించారని తెలిసింది. 2008 నుంచి వీరికి డైలీ వేజెస్ కింద ఇప్పటి వరకు వారికి జీతాలు చెల్లిస్తున్నారు. కాగా ప్రభుత్వం 1994 యాక్టు ప్రకారం సెక్షన్(3) సబ్‌సెక్షన్(1)లో ఎంఎంఆర్(నాన్ మస్టర్ రోల్), డైలీ వేజెస్‌లను యూనివర్సిటీ, స్థానిక లోకల్ బాడీస్లలో నియామకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని కొనసాగింపుగా కొత్త నియామకాలపై నిబంధనలు జారీ చేస్తూ 2013 మార్చి 28న జీవో నంబర్ -94ను కూడా విడుదల చేసింది. త్రిసభ్య కమిటీ విచారణ ఈ నియామకాలపై ఫిర్యాదులు రావడంతో 2013లో అప్పటి యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ స్పందించారు. ప్రొఫెసర్లు పాపారావు, టీవీ కృష్ణారెడ్డి, ధనుంజయ నాయుడుతో త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ విచారణ చేసి 23 మందిని జీవో, ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా నియమించారని విచారణ నివేదికను వీసికి అందించింది. అడ్డదారిలో జీతాల పెంపు 2010లో ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన పీఆర్సీ ప్రకారం ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కింద పని చేసే సిబ్బందికి కూడా జీతాలు పెంచడానికి 2011 జనవరి 12నజీవో నంబర్- 3 ప్రభుత్వం విడుదల చేసింది. ఆ 23 మందికి ఈ జీవో అడ్డు పెట్టుకొని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జీతాలు పెంచేశారు. ఎలా బయటికి వచ్చిందంటే అక్రమనియామకాల విషయం సమాచార హక్కు చట్టంతో బయట పడింది. దీంతో యూనివర్సిటీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంతా అధికార పార్టీ నేత ఒత్తిడితోనే ఈ నియామకాలు జరిగాయని ఇటీవల విద్యార్థి సంఘాల ఆందోళనలో యూనిర్సిటీ అధికారి చెప్పారని సమాచారం. -
లక్ష్య సాధన కోసం శ్రమించాలి
- ఐఐటీ ప్రొఫెసర్ మూర్తి ప్రొద్దుటూరు: లక్ష్యసాధన కోసం విద్యార్థులు శ్రమించాలని ఐఐటీ చెన్నై ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. స్థానిక వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలను మంగళవారం సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో నిష్ణాతులుగా ఎదగాలంటే కృషి, పట్టుదల ఉండాలన్నారు. యువత పరిశోధన రంగంవైపు అడుగులు వేయాలని, పరిశోధనపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు దేశంలోని ఎన్నో విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు ద్వారాలు తెరచి ఉంచాయన్నారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.జయచంద్రారెడ్డి, ప్రొఫెసర్ బీ.జయరామిరెడ్డి, ఎంఎంటీ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ డాక్టర్ ఏ.అశోక్ పాల్గొన్నారు. నేడు జాతీయ సదస్సు వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ మెటలర్జి అండ్ మెటీరియల్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కు సంబంధించి యూజీసీ ఆధ్వర్యంలో రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ మెటలర్జి అండ్ మెటీరియల్ సైన్స్ రామ్ -2కే15 జాతీయ సదస్సు బుధవారం నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఏ.అశోక్‌కుమార్ తెలిపారు.