breaking news
yaddanapudi village
-
ఏ పనికైనా జేబు నిండాల్సిందే..
సాక్షి, యద్దనపూడి (ప్రకాశం): మండల కేంద్రమైన యద్దనపూడి మండల పంచాయతీ తాజామాజీ కార్యదర్శి కుమారస్వామి గత ప్రభుత్వ కాలంలో అప్పటి అధికారపార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోయి ప్రవర్తించిన తీరు ప్రస్తుతం మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గత ఎనిమిది సంవత్సరాల్లో యద్దనపూడి పంచాయతీ కార్యదర్శిగా, రెండు సంవత్సరాలుగా ఈఓఆర్డీగా విధులు నిర్వహించిన కుమారస్వామి గత జూలై 23న ఇక్కడ నుంచి బదిలీపై పుల్లల చెరువు మండలం వెళ్లి లాబీయింగ్ ద్వారా ప్రస్తుతం బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుమారస్వామి ఇక్కడ కార్యదర్శిగా విధులు నిర్వహించిన సమయంలో నాటి అధికార పార్టీ నేతల దెబ్బకు సదరు అధికారిపై నోరుమెదపలేని వారు ప్రస్తుతం ప్రభుత్వం మారటంతో ధైర్యంగా ఒక్కొక్కరు తమకు జరిగిన అన్యాయాలను బహిర్గతం చేయటం గమనార్హం. ఇదిగోండి జాబితా.. ► యద్దనపూడి గ్రామానికి చెందిన రావిపాటి లక్ష్మీకాంతమ్మ అనే వృద్ధురాలికి గత సంవత్సరం జూన్ నెలలో వృద్ధాప్య పింఛన్ మంజూరు కాగా ఆ మహిళకు పెన్షన్ ఇవ్వకుండా అదే గ్రామానికి చెందిన రావిపాటి కాంతయ్య అనే పురుషునికి గత నెల ఆగస్టు వరకు అంటే 14 నెలల పాటు పెన్షన్ ఇచ్చారు. ఇది స్థానికులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం సదరు మహిళ ఎంపీడీఓ కార్యాయలంలో, సీఎం పేషీలో ఫిర్యాదు చేయటంతో శుక్రవారం యద్దనపూడి వచ్చిన కుమారస్వామి స్థానిక నేతల ద్వారా ఆ మహిళతో రాజీయత్నం చేయటం గమనార్హం. ► అలాగే మండలంలో గన్నవరం గ్రామానికి చెందిన కేతినేని అంజమ్మ అనే మహిళ యద్దనపూడి గ్రామ పరిధిలో 2016లో అంజలి ఇండస్ట్రీస్ పేరుతో ఫ్యాక్టరీ స్థాపించేందుకు అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకుంది. లక్ష రూపాయలు ఇస్తేనే అప్రూవల్ ఇస్తానని చెప్పటంతో చేసేదేమి లేక రూ.30 వేల నగదును ఇచ్చింది. మరోసారి రూ.70 వేలను అంజలి ఇండస్ట్రీస్ బ్యాంకు ఖాతా నెంబరు 916020070482078 నుంచి కుమారస్వామికి చెందిన స్టేట్ బ్యాంకు ఖాతాకు జమ చేసింది. ఆ తర్వాతే అప్రూవల్ మంజూరు చేసినట్లు బాధితులరాలు వాపోయింది. ► యద్దనపూడి గ్రామంలో హౌస్ అప్రూవల్ కోసం నల్లపునేని అనీల్ వద్ద రూ.60 వేలు, ఎన్. సీతమ్మ అనే మహిళ రూ.20 వేలు, టి.బాబు వద్ద రూ.22 వేలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ► 100 శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు గతంలో రూ.1500 పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా చాలామందికి రూ.1000 మాత్రమే ఇచ్చినట్లు బాధితుల ఆరోపణ. అలాగే పంచాయతీ నీటికుళాయి కనెక్షన్‌కు పరిమితికి మించి వసూలు చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టకుండానే లక్షల రూపాయల నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఆయన బదిలీపై వెళ్లినా పూర్తిస్థాయిలో రికార్డులు కూడా సదరు పంచాయతీలకు అందజేయలేదని గ్రామస్తులు చెప్పటం గమనార్హం. ► మరణధ్రువీకరణ పత్రాల మంజూరులో రూ.3 వేల నుంచి రూ.8 వేలు వరకు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. గతంలో పర్చూరు మండలం చెరుకూరులో, చీమకుర్తిలో అవినీతి ఆరోపణలపై రెండుసార్లు సస్పెండ్ అయినప్పటికీ కుమారస్వామి తన ప్రవర్తన మార్చుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అతనిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇవన్నీ ఆరోపణలే.. కొందరు కావాలనే నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. లక్ష్మీకాంతం పింఛన్ విషయంలో పొరపాటు పడిన మాట వాస్తవమే. - పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి -
జనసంద్రం
⇒జననేతను చూడటానికి తరలివచ్చిన అభిమానులు ⇒నరసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ ⇒భరత్... రవికుమార్లది సూపర్‌హిట్ కాంబినేషన్ ⇒వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగ న్మోహన్ రెడ్డి ప్రశంసలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు, మార్టూరు, యద్దనపూడి: యద్దనపూడి గ్రామం జనసంద్రమైంది. ఉదయం నుంచి కురుస్తున్న చిరు జల్లులు ఒకవైపు ... పొలాల్లో విచ్చుకుంటున్న పత్తి పాడైపోతోందన్న భయం మరోవైపు రైతుల్లో ఉన్నా తమ అభిమాన నేతను చూసేందుకు చుట్టుపక్కల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. గురువారం యద్దనపూడిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అభిమానులు ఘనస్వాగతం పలికారు. జిల్లాలో అడుగుపెట్టిన మొదలు యద్దనపూడి వచ్చే వరకూ అన్ని గ్రామాల్లో జగన్‌ని చూసేందుకు, కరచాలనం చేసేందుకు జనం ఎగబడ్డారు. వారందరినీ జగన్ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగారు. భరత్‌కు అండగా ఉంటా... వైఎస్ఆర్సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి భరత్‌కు తాను ఎప్పుడూ అండగా ఉంటానని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వర్షంపడుతున్నా లెక్కచేయకుండా వచ్చిన అక్కా చెల్లెమ్మలకు, అన్నా తమ్ముళ్లకు శిరస్సు వంచి ముందుగా నమస్కరిస్తున్నానన్నారు. ఎన్నికల ముందు అధిక వర్షాలు పడినప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుని రైతులకు సహకారం అందించాలని గ్రామాల్లో పర్యటిస్తూ గొట్టిపాటి నరసింహారావు అనారోగ్యానికి గురై మరణించిన విషయం మీకు తెలిసిందేనని అన్నారు. భౌతిక కాయాన్ని సందర్శించడానికి వచ్చిన సమయంలో ఆమె భార్య పద్మ భరత్ చేతిలో చేయి వేసి భరత్ భవిష్యత్తు మీరే చూసుకోవాలని కోరారన్నారు. ఎప్పటికీ భరత్ తన తమ్ముడులాంటి వారేనన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ది, భరత్‌ది (బాబాయి, అబ్బాయిది) సూపర్‌హిట్ కాంబినేషన్ అని హర్షధ్వానాల మధ్య అన్నారు. తాను ఇప్పుడు రాజకీయ ప్రసంగం చేయదల్చుకోలేదని ప్రజలకు వివరించారు. ప్రజల కోసం మరణించారు... గొట్టిపాటి నరసయ్య జనం కోసం పనిచేసే వ్యక్తి అని అని గిద్దలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి కొనియాడారు. చివరినిమిషం వరకు వారితోనే ఉన్నగొట్టిపాటి నరసయ్య మరణించినా ప్రజలు ఆయన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారన్నారు. వై.ఎస్. అండ ఎప్పుడూ ఉండేది... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి తన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉన్నారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు తమను ఆదరిస్తున్నారన్నారు. రానున్నఎన్నికల్లో భరత్‌ను గెలిపించి తీరుతామన్నారు. డబ్బుల కోసం పనిచేయలేదు పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి భరత్ మాట్లాడుతూ తన తండ్రి కాంస్య విగ్రహావిష్కరణకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో మంది డబ్బున్న వాళ్లు పర్చూరు సీటు కోసం ప్రయత్నించినా జగనన్న తనకుటుంబం మీద ఉన్న అభిమానంతో తనకు సీటు కేటాయించారన్నారు. తన కుటుంబం 35 సంవత్సరాల నుంచి ప్రజలతోనే నడుస్తోంది. తాము జనాలకు పనులు చేసి ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదని, కానీ ఇప్పుడు గెలిచినవారు ప్రతి రేషన్ షాపు నుంచి కోటాకు నెలకు రూ.1500 వసూలు చేస్తున్నారన్నారు. కొన్ని ఇబ్బందులున్నందున ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ఇక నుంచి వారానికి నాలుగు రోజులు అందుబాటులో ఉంటానని చెప్పారు. జగన్ అనే మహాశక్తి నా వెనుక ఉందని, తనకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. తన తాత గొట్టిపాటి హనుమంతరావు, తన తండ్రి గొట్టిపాటి నరసింహారావు, తన బాబాయి గొట్టిపాటి రవికుమార్ చూపిన బాటలో నడుస్తానన్నారు. జగన్ రాకతో జనసంద్రమైన యద్దనపూడి వైఎస్ఆర్ సీపీ అధినేత వై.ఎస్. జగన్ యద్దనపూడి రాకతో వైఎస్ఆర్ సీపీ అభిమానులు, గొట్టిపాటి అభిమానులతో యద్దనపూడి జనసంద్రమైంది. యద్దనపూడి సెంటర్లోని నివాస గృహాలపైకి ఎక్కి జనం జగన్‌ను చూసేందుకు ఆసక్తి చూపించారు. పర్చూరు, అద్దంకి, చిలకలూరిపేట నియోజకవర్గాల నుంచి గొట్టిపాటి అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విగ్రహావిష్కరణ తర్వాత అక్కడి నుంచే ప్రసంగించారు. కనపడలేదంటూ అభిమానులు గోల చేయడంతో జగన్ అక్కడే ఏర్పాటు చేసిన వేదికపైకి ఎక్కి అందరినీ పలకరించారు. అభిమానులతో కరచాలనం చేశారు. అనంతరం గొట్టిపాటి భరత్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో రెండు గంటలకుపైగా గడిపారు. అక్కడి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్లారు. వాహనాల రాకపోకలకు అంతరాయం జనం అధిక సంఖ్యలో హాజరు కావటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. దీంతో గన్నవరం సమీపంలో, యనమదల వద్ద వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనాలు అక్కడే నిలిపి జగన్‌ను చూడటానికి కాలినడకన తరలి వచ్చారు. యనమదలలో స్వాగతం పలికిన నేతలు... చిలకలూరిపేట నుంచి యద్దనపూడికి వస్తున్న జగన్ కాన్వాయి యనమదల వద్ద అభిమానులు రోడ్డు మీద నిలబడి ఉండటంతో ఆపారు. రోడ్డు మీద నిల్చొని ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు దొడ్డా బ్రహ్మానందాన్ని జగన్ పలకరించి కరచాలనం చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, జిల్లా ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్ రాజు, ఆదిమూలపు సురేష్, జంకె వెంకటరెడ్డి, పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బాచిన చెంచు గరటయ్య, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్, చీరాల నియోజకవర్గ ఇన్చార్జి యడం బాలాజీ, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, మార్టూరు, ఇంకొల్లు మండల పార్టీ కన్వీనర్లు తోకల కృష్ణమోహన్, దూళిపాళ్ల వేణుబాబు,పఠాన్ కాలేషావలి, దండా చౌదరి, కోట్ల విజయ భాస్కరరెడ్డి, డెయిరీ మాజీ చైర్మన్ ఉప్పలపాటి చెంగలయ్య నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.