ఆందోళన కలిగిస్తున్న సైనిక మరణాలు
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లో సైనికుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సైనిక మరణాల్లో 30 శాతం గుండె సంబంధిత వ్యాధులు, రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించడం ఆందోళన కలిగిస్తోందని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ తెలిపారు. ఇండో-పాక్ ఇంటర్నేషనల్ బార్డర్(ఐబీ) జైసల్మీర్ లో సైనికులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
జీవనశైలి మెరుగుపరచుకోవాలని, డ్రైవింగ్ లో అప్రమత్తంగా ఉండాలని సైనికులకు ఆయన సూచించారు. గతేడాది 400 సైనిక మరణాలు సంభవిస్తే అందులో 70 మంది గుండెపోటుతో, 50 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారని చెప్పారు. సరిహద్దు పరిరక్షణకు టెక్నాలజీ సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు. కొత్తగా పెళ్లైన సైనికులు తమ కుటుంబాలతో కలిసి జీవించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.