కుడి ఎడమల దగా
పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు
సర్వత్రా కల్తీ తూకంలో మోసాలు
నిత్యం ఎడాపెడా దోపిడీ
వీటిపైనే సిటీజనుల పోరు
నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
సాక్షి, సిటీబ్యూరో :
నింగిని తాకే ధరలు.. కల్తీ చేసే ‘దొరలు’.. తూకంలో తికమక లు.. ‘నయా’వంచన.. హైటెక్ ట్రిక్కులు.. జిమ్మిక్కులు.. వెరసి సిటీజనులు నిత్యావసరాల విషయంలో నిత్యం దగా పడుతున్నారు. కళ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. సిటీలో సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే ఉండటం లేదు. ఇక కొనుగోళ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. ఇదే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఎజెండాగా నిలవనుంది. ఓట్లు అడిగేందుకు వచ్చే రాజకీయ నేతలను నిత్యావసరాల దగాపై సిటీజనులు నిలదీ యనున్నారు. ఇక రాజకీయ పక్షాలు సైతం తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో ధరల అదుపు, కల్తీ, మోసాల నియంత్రణ తదితర అంశాలను చేర్చక తప్పని పరిస్థితి నెలకొంది.
దరాఘాతం
పెరుగుతున్న ధరలతో సిటీజనులు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్, గ్యాస్, పెట్రోల్ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర చూసినా ఆకాశంలోనే.. అన్న రీతిలోనే ఉంది. మరోవైపు కూరగాయల ధరలు కూడా కొండె క్కి దిగిరానంటున్నాయి. పొయ్యి పైన పెట్టే నిత్యావసరాల నుంచి కింద భగ్గున మండే గ్యాస్ బండ వరకు ప్రతీది సామాన్యుడికి భారంగానే ఉంది. ధరల పెరుగుదలకు సంపన్నులే అబ్బా అంటుంటే.. పేద, మధ్యతరగతి జీవుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెరిగే ధరలతో ప్రజలు అగచాట్లు పడుతున్నా వీటిని కట్టడి చేసే నాధుడే కరువయ్యాడు. ప్రజల ఒత్తిడి మేరకు అధికార యం త్రాంగం అప్పుడప్పుడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నిర్ణీత ధరలకే సరుకులు సరఫరా చేస్తున్నా.. అవి కాస్త మూన్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. గత పదేళ్లలో ప్రతి సరుకు ధర కనీసం రెండువందల నుంచి నాలుగు వందల రెట్లు పెరిగినా..సగటు జీవి ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఈ స్థితి నుంచి విముక్తి కలిగేదెన్నడు? అన్నదే సామన్యుడి ప్రశ్న.
ఆరోగ్యాన్ని హరిస్తున్న కల్తీ
నగరంలో కల్తీ వైరస్‌లా వ్యాప్తి చెందింది. సిటీలో కల్తీ లేని వస్తువు ఏది అంటే.. సమాధానం కోసం తడుముకోవాల్సిందే. నిత్యం సేవించే పాలు నుంచి అందులో వాడే టీ, కాఫీ పొడి, పంచదార.. ఇలా అన్నింటిలోనూ కల్తీనే. వ్యాపారులు కల్తీతో లక్షలు ఆర్జిస్తుంటే.. వాటిని వినియోగించి పాపం పుణ్యం ఎరుగని పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. పాలలో నీళ్లు, గంజిపోడి, సోడియం బై కార్పోనేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా, అమ్మోనియం సల్ఫేట్ తదితర రసాయనాలు కలపడం సర్వసాధారణంగా మారింది. ప్రయివేటు డెయిరీలు లాభాల కోసం పాలను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా.. నియంత్రించే వారే కరువయ్యారు. టీ, కాఫీ పొడుల్లో జీడిమామిడి పొట్టు, వాడిన టీ ఆకులు, చికోరి, చింతపిక్కల పొడి, కృత్రిమ రంగులు, ఇనుప రజను, మిర్చి పొడిలో రంపపు పొట్టు, మిరియాల్లో బొప్పాయి విత్తనాలు, పసుపు పొడిలో రంపపు పొడి, రవ్వలో తవుడు, పంచదారలో సన్నని రాళ్లు కలిపేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రక్కసిని అరికట్టాల్సిన అధికారులు, పాలకులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో.. ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు.
తప్పుడు తూకాలు
మహానగరంలో తూకంలో జరిగనన్ని మోసాలు మరెందులోనూ జరగవంటే అతిశయోక్తి కాదు. పాల నుంచి పప్పు వరకు, కిరోసిన్ నుంచి కూరగాలయ వరకు అన్నీ తప్పుడు తూకాలే. చిల్లర కొట్టు, బండి నుంచి బడా మాల్స్ వరకు అన్నింటా తప్పుడు తూకాలే. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌లో చేతివాటం.. బంగారం తూచే మిషన్లలో మోసాలు.. ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ పంపిగ్లో జంపింగ్ మోసం.. ఇటీవలే ఒక్కొక్కటిగా బయటపడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే సగానికి పైగా పెట్రోల్ అమ్మకాలో వాట గల నగరంలో కొత్త తరహా మోసాలు బయటపడటం సిటీజనులను నివ్వెరపర్చింది. వీటిని అరికట్టే వారే లేరా అన్నది నగరవాసి ప్రశ్న.
సబ్సిడీ పక్కదారి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేద ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సబ్సిడీ కూడా నగరంలో పక్కదారి పడుతోంది. పేదల రేషన్ బియ్యం, కిరోసిన్, ఇతరత్రా వస్తువులు నల్లబజారుకు తరలుతున్నాయి. సిటీజనులకు అందాల్సిన వివిధ వస్తువులపై నెలసరి సబ్సిడీ విలువ రూ.30 కోట్లపైనే ఉంటుంది. కానీ అందులో సగానికి పైగా పేదలకు అందని ద్రాక్షగా మారి పక్కదారి పట్టడం సర్వసాధారణంగా మారింది. మరోవైపు గృహవినియోగ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లు సైతం వాణిజ్య అవసరాల కోసం పక్కదారి పడుతున్నాయి. వీటిని పర్యవేక్షించి అరికట్టేందుకు ప్రత్యేక శాఖలున్నా అంతా ‘మాములే’.
లెక్కా పత్రాలుండవా
సిటీలో సగటు జీవి షాపింగ్‌మాల్.. హోటల్.. ఆస్పత్రి.. ఎక్కడికి వెళ్లినా నిలువుదోపీడేయే. ఇష్టానుసారం ధరలు, బిల్లింగ్, అర్ధం కాని అంకెలు. వ్యాపారులు వేసే ధరలు.. వాటిపై పన్నుల మోత.. ఇచ్చే రసీదులు కళ్లు బైర్లు కమ్మిస్తాయి. దీనిపై నియంత్రణ లేదా? ఈ మోసాలు ఎన్నాళ్లు భరించాలని సిటీజనులు ప్రశ్నిస్తున్నారు.
వంటగ్యాస్‌పై ‘వైఎస్’ ఇచ్చిన సబ్సిడీ ఏదీ?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌పై ఒకేసారి రూ. 50లు పెంచింది. ఇది ప్రజలకు భారమని భావించిన వైఎస్ అప్పట్లో పెరిగిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీగా భరించేందుకు సిద్ధమయ్యారు. కేంద్రం రూ. 25 తగ్గించడంతో మిగతా రూ.25 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ వచ్చింది. అయితే ఇటీవల నగదు బదిలీ పుణ్యమా అంటూ కిరణ్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ. 25లను రద్దు చేసింది. దీంతో సబ్సిడీ సిలిండర్‌పై భారం పడి ఎల్పీజీ ధర రూ.441కి చేరింది. కిరణ్ సర్కార్ ఎత్తివేసిన సబ్సిడీని తిరిగి పునరుద్దరిస్తే వంటగ్యాస్ సిలిండర్ రూ. 416కే ప్రజల కందే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ కొనసాగించాలని గృహిణులు రాజకీయ పక్షాలను డిమాండ్ చేయనున్నారు.
సరుకుల ధరలను నియంత్రించాలి
రాజకీయ పక్షాలన్నీ తమ మేనిఫెస్టోల్లో నిత్యావసరాలపై నియంత్రణ అంశాన్ని స్పష్టంగా చేర్చాలి. నిత్యావసర సరుకుల ధరలను అదుపులో పెడతామని స్పష్టంగా హమీ ఇవ్వాలి. కల్తీ, మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలను మరింత పటిష్ట పరిచి, వారికి మరిన్ని అధికారాలు కల్పించాలి.
-ప్రొఫెసర్ ఎ. బాలకిషన్,
వినియోగదారుల ఫోరం, హైదరాబాద్
కల్తీని అరికట్టాలి
వ్యాపారులు కల్తీ సరుకులు అంటగట్టినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నాసిరకం ఆహార పదార్థాలతో అనారోగ్యాలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. వ్యాపారులు నకిలీ వస్తువులు అంటగట్టినా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. వీటిపై గట్టి చర్యలు తీసుకోవాలి.
- చెన్న నరేందర్‌దేవ్, కార్వాన్, దుస్తుల వ్యాపారి
రేషన్ డీలర్లా.. వ్యాపారులా?
బయట ఐదు రూపాయలకు దొరికే చాపొడి ప్యాకెట్ రేషన్ డీలర్లు రూ.10కు అంటగడుతున్నారు. నాణ్యత లేని ఉప్పు కిలో రూ.15కు ఇస్తున్నారు. వద్దంటే బియ్యం, కిరోసిన్ ఇవ్వమంటూ బెదిరిస్తున్నారు. గత్యంతరం లేక కొంటున్నాం. బియ్యం తూకంలో కూడా మోసపోతున్నాం. నాలుగు లీటర్ల కిరోసిన్‌కు మూడున్నర లీటర్లే వస్తుంది. - మమ్మూబాయి, గోల్కొండ
పెట్రోల్ ధరలను తగ్గించాలి
పెరిగిన పెట్రోల్ ధరలతో ద్విచక్ర వాహనాలు నడపలేని పరిస్థితి నెలకొంది. నాలుగేళ్ల క్రితం రూ. 55లుగా ఉన్న లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.80కి చేరింది. చమురు ధరలు పెరిగాయన్న సాకుతో ఆయిల్ కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం కూడా వాటికి తలూపుతూ ప్రజలపై ధరల భారం మోపుతోంది. పెట్రోల్, డీజీల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరించాలి.
- సాయికుమార్ గౌడ్, గౌలిపురా.
భారమైన కుటుంబ పోషణ
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాలను పోషించలేని పరిస్థితి నెలకొంది. కూరగాయలు, పప్పు, ఉప్పులు ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశన్నంటుతుండడంతో ఏమి చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. వచ్చే నెల జీతంతో కుటుంబ పోషణ గగనమవుతోంది. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలి. గ్యాస్ ధరలు కూడా గతంలో కంటే పెంచేశారు. అన్నింటి ధరలను తగ్గించాలి.
- టి.రాజేష్, సుల్తాన్షాయి