భారత్‌కు ప్రమోషన్
ఫెడ్‌కప్ టెన్నిస్ ఆసియా ఓషియానియా గ్రూప్-1కు అర్హత
సాక్షి, హైదరాబాద్: భారత జట్టుకు తన అవసరం ఉంటే బరిలోకి దిగుతానని చెప్పిన డబుల్స్ ప్రపంచ నంబర్‌వన్ సానియా మీర్జా కీలక సమయంలో జట్టును ఆదుకుంది. ఫెడ్ కప్‌లో భాగంగా నగరంలో జరిగిన ఆసియా ఓషియానియా గ్రూప్-2 ఫైనల్ ప్లే ఆఫ్‌లో భారత్‌ను గెలిపించింది. శనివారం ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్ ప్లే ఆఫ్‌లో భారత్ 2-1తో ఫిలిప్పీన్స్‌ను ఓడించింది.
తొలి సింగిల్స్‌లో ప్రార్థనా తోంబరే 6-3, 6-1తో పాత్రిమోనియోపై గెలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించింది. కానీ రెండో సింగిల్స్‌లో ఫిలిప్పీన్స్ క్రీడాకారిణి కాథరీనా 2-6, 7-5, 7-5తో అంకితా రైనాను ఓడించడంతో స్కోరు 1-1తో సమమైంది. ఈ మ్యాచ్‌లో రెండో సెట్లో ఆధిక్యంలో ఉన్న దశ నుంచి అంకితా మ్యాచ్ ఓడిపోయింది. ఇక కీలకమైన డబుల్స్ మ్యాచ్‌లో సానియా, ప్రార్థన జోడి 6-3, 6-3తో కాథరినా, అనా క్లారైస్పై నెగ్గి... 2-1తో భారత్‌కు విజయాన్ని ఖరారు చేసింది. దీంతో భారత్ 2016లో జరిగే ఆసియా ఓషియానియా గ్రూప్-1కు అర్హత సాధించింది.