మహిళపై అత్యాచారం.. హత్య
హైదరాబాద్ శివార్లలో దారుణం
సాక్షి, హైదరాబాద్: కొందరు దుండగులు ఓ మహిళపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కత్తులతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వాహనాల కింద పడి చనిపోయేలా నడిరోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఆ మహిళను గమ నించిన ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. కానీ, చికిత్స పొందుతూ మరణించింది. హైదరాబాద్ శివార్లలోని హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్‌రోడ్డుపై బుధవారం అర్ధరాత్రి అనంతరం ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నగర శివారులోని హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఒక మహిళ తీవ్ర గాయాలతో పడి ఉందని బుధవారం అర్ధరాత్రి రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో అక్కడికి పోలీసులు చేరుకోగా.. మద్యం మత్తులో ఉన్న ఆమె నుదురు, చేతులపై కత్తులతో కోసిన గాయాలున్నాయి. తీవ్ర రక్తస్రావం జరుగుతుండడంతో ఆమెను వెంటనే 108 వాహనంలో ఉస్మానియాకు తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. అయితే తనపేరు లలిత అని ఒకసారి, శిరీష అని ఒకసారి, స్వరూప అని మరోసారి.. సొంతగ్రామం మహబూబ్‌నగర్ అని, మరోసారి ఎర్రబోడ అని తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఆ మహిళపై లైంగికదాడి చేసి, కత్తులతో దాడిచేసి ఔటర్ రింగ్‌రోడ్డుపై పడవేశారని పేర్కొన్నారు. కాగా, ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేపట్టామని, ఇప్పటికే మిస్సింగ్ కేసులపై దృష్టి సారించామని, మృతురాలి ఫొటోను అన్ని పోలీస్స్టేషన్లకు పంపామని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కుశాల్కర్ తెలిపారు. దీంతోపాటు ఔటర్ రింగ్‌రోడ్డుపై సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.