breaking news
the women
-
మహిళలకే మార్కెట్ పీఠాలు
వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్ ఖంగుతిన్న ఆశావహులు, అధికార పార్టీ నేతలు చేవెళ్ల స్థానం బీసీ మహిళకు సర్ధార్‌నగర్, శంకర్పల్లి బీసీలకు కేటాయింపు వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉంది సర్కార్. చైర్మన్ల నియామకంలో తొలిసారిగా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు.. మహిళలకు 33 శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకూ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు తమకే దక్కుతాయని ఆశించిన పలువురు అధికార పార్టీ నేతలు ఖంగుతిన్నారు. మార్కెట్ కమిటీలకు మహిళలను నియమించనున్నారనే విషయం తెలుసుకుని నిరాశ చెందారు. మేలోపు పాలకమండళ్లను కొలువుదీర్చేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. మంత్రి హరీశ్‌రావు ప్రకటించడం, మహిళా రిజర్వేషన్లు ఖరారు కావడంతో.. పైరవీలు జోరందుకున్నాయి. చేవెళ్ల : తాజా సవరణమేరకు తెలంగాణ రాష్ట్రంలోని 168 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో.. మహిళలకు 55 స్థానాలు దక్కనున్నాయి. వీరికి కేటాయించే స్థానాలను ఇప్పటికే ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, సర్ధార్‌నగర్, శంకర్పల్లి, వికారాబాద్, ధారూరు, పరిగి, తాండూరు, మర్పల్లి, ఇబ్రహీంపట్నం, నార్సింగి, మేడ్చల్‌ను కలిపి 11 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. తాజా సవరణల మేరకు 33 శాతంతో నాలుగు కమిటీలకు మహిళలే చైర్పర్సన్లుగా ఎన్నిక కానున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రస్తుతమున్న కమిటీల పదవీకాలం ముగియకున్నా 2014 ఆగస్టులో ఆర్డినెన్స్ద్వారా ఈ పాలకమండళ్లను రద్దుచేసింది. రైతుల సమస్యలపై దృష్టిసారించి, వారికి మేలు చేయాల్సిన వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రాజకీయ నాయకులు తిష్టవేశారని, దీన్ని ప్రక్షాళన చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా వ్యవసాయం తెలిసి.. రైతులై ఉన్నవారినే ఈ కమిటీల్లో నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. చేవెళ్ల బీసీ మహిళలకు కేటాయింపు... నియోజకవర్గం పరిధిలో చేవెళ్ల, శంకర్పల్లి, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీలున్నాయి. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి చేవెళ్ల మండలం, శంకర్పల్లి మార్కెట్ పరిధిలోని శంకర్పల్లి మండలం, సర్ధార్‌నగర్ మార్కెట్ పరిధిలోని షాబాద్, మొయినాబాద్ మండలాలు వస్తాయి. నవాబుపేట మండలం మాత్రం వికారాబాద్ మార్కెట్ పరిధిలోకి వస్తుంది. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీని బీసీ మహిళలకు, సర్ధార్‌నగర్, శంకర్పల్లి బీసీలకు కేటాయించారు. పైరవీలు షురూ.. నామినేటెడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఈనెలాఖరులోగా నియమించేందుకు సీఎం అంగీకరించడం, మహిళా రిజర్వేషన్లు కూడా అధికారికంగా ప్రకటించడంతో ఆశవహులు ఇప్పటికే పైరవీలు ప్రారంభించారు. చేవెళ్ల మార్కెట్ కమిటీని బీసీ మహిళలకు కేటాయించడంతో పదవిని ఆశిస్తున్న పలువురు నాయకులు సోమవారం మంత్రి మహేందర్‌రెడ్డిని కలిశారు. జెడ్పీటీసీ ఎం.బాల్‌రాజ్, పార్టీ మండల అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి తదితరులు ఫలానా వారికే చైర్మన్‌గిరీ ఇవ్వాలని మంత్రికి విన్నవించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మార్కెట్ ఉపాధ్యక్ష పదవి మాత్రం మంత్రి అనుచరుడు, టీఆర్ఎస్ నాయకులు మాసన్నగారి మాణిక్‌రెడ్డికే దాదాపుగా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. షాబాద్ మార్కెట్ కమిటీ పదవికి నాగరకుంట పీఏసీఎస్ మాజీ చైర్మన్ వెంకటయ్యకే దక్కనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. శంకర్పల్లి మార్కెట్ పదవి బొమ్మ నగారి కృష్ణకుగాని, మీర్జాగూడకు చెందిన ఒగ్గు మల్లేశ్కుగానీ దక్కవచ్చని తెలుస్తోంది. -
మహిళల కోసం తరుణి స్టేషన్
దూలపల్లి: నగర మెట్రో ప్రాజెక్టుల మహిళలకు కోసం ప్రత్యేకంగా ‘తరుణి’ పేరుతో మెట్రో స్టేషన్ ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. మధురానగర్‌లో ఏర్పాటుచేసే ఈ స్టేషన్లో పూర్తి గా మహిళా ఉద్యోగులే ఉండే లా చర్యలు తీసుకుంటామన్నా రు. మహిళలకు సంబంధించి ఫ్యాషన్, గృహోపకరణాలు, దుస్తులు వంటి అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉం చుతామన్నారు. విద్యార్థులు, పిల్లలకు మియాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో వేర్వేరుగా ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా స్టేషన్ల ప్రాంగణాల్లో చిన్నారులు ఆడుకునేందుకు గేమ్‌జోన్ సౌకర్యాలతోపాటు, విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ,పుస్తకాలు వంటివి అందుబాటులో ఉండేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. మైసమ్మగూడాలో ని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగోల్-మెట్టుగూడా రూట్లో మెట్రో తొలిదశను 2015 మార్చి 21న ప్రారంభించనున్నట్టు చెప్పారు. 2017 నాటికి మూడు కారిడార్ల పరిధిలో 72 కిలోమీటర్ల మార్గం పూర్తయిన తరవాతనగరంలో మరో 200 కి.మీ వరకు మెట్రో మార్గాన్ని విస్తరించేందుకు ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు.