గాలి... ఫర్ సేల్...
గాలి కనిపిస్తుందా?
ఈ ప్రశ్నలో బోలెడంత చమత్కారం ఉంది.
గాలిని కొంటున్నారా?
అనే ప్రశ్నకూ అంతే నవ్వొస్తుంది. కానీ, తాజాగాలిని డబ్బాలో నింపి అమ్మేస్తున్నారు ఫ్రాన్స్‌లో.
నగరాల్లో స్వచ్ఛమైన గాలి పీల్చుకునే భాగ్యానికి దూరమైన వారు ఈ గాలితో పల్లెదనాన్ని ఆస్వాదిస్తున్నారు.
ప్రకృతి సిద్ధంగా లభించే గాలి, నీరు, సూర్యరశ్మి వంటివి ఉచిత వస్తువులని చెప్పే అర్థశాస్త్రాన్ని తిరగ రాసుకోవాల్సిన రోజులు వచ్చిపడుతున్నాయి. మంచినీరు ఇప్పటికే మార్కెట్ వస్తువుగా మారింది. నానా కాలుష్యాలు నిండి ఉంటే ఉండొచ్చుగాక, అయినా సరే మనం గాలిని ఉచితంగానే పీల్చుకోగలుగుతున్నాం. అయితే, కొన్ని దేశాల్లో ముందుచూపు గల మహానుభావులు గాలిని సైతం డబ్బాల్లో బంధించి, వాటిని సీల్ చేసి మార్కెట్లో సొమ్ము చేసుకుంటున్న ఉదంతాలు అక్కడక్కడా వార్తలకెక్కుతున్నాయి.
మనం నిత్యం శ్వాసించే ప్రాణవాయువు మాత్రమే కాదు, నానా వాయువులనూ డబ్బాల్లో బంధించి ఎడాపెడా సరసమైన ధరలకు అమ్మేస్తున్నారు. జనం కూడా వేలంవెర్రిగా ఎగబడి మరీ గాలి డబ్బాలను అపురూపంగా కొనుక్కుంటున్నారు. గాలిని ఖాళీ డబ్బాల్లో పోగేసి, గల్లా పెట్టెలను నింపుకొంటున్న కొన్ని ఉదంతాలు...
తాజా తాజా ‘పల్లె’గాలి...
చల్లచల్లని పల్లెగాలి తాజాదనం అర్బన్ అర్భకులకు అరుదుగా తప్ప దక్కని అనుభవం. పల్లెపట్టుల్లోని గాలి స్వచ్ఛతే వేరు. నరకానికి నకళ్లలాంటి నగరాల్లో జీవించే నాగరికుల్లో చాలామంది మూలాలు పల్లెల్లోనే ఉంటాయి. అలాంటి వారంతా పల్లెలపై మనసు మళ్లినప్పుడు, మనసు మళ్లినా పల్లెలకు వెళ్లలేని అనివార్యతల్లో పల్లెగాలిని తలచుకుంటూ నిట్టూర్పులు విడుస్తుండటం మామూలే! అలాంటి వారందరికీ పల్లెగాలిపై ఎడతెగని మమకారం ఉంటుంది.
ఎందుకంటే పల్లెగాలి వారికి తల్లిగాలి! ఈ విషయాన్ని గమనించిన ఇరవెరైండేళ్ల ఫ్రెంచి విద్యార్థి ఆంటోయినే డెబ్లేకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. అతగాడి ఆలోచన ఫలితంగా పల్లెగాలి డబ్బాల్లోకి చేరింది. ‘ఎయిర్ డి మాంట్కక్’ పేరుతో ఆన్లైన్ మార్కెట్లోకి విడుదల చేసిన ఈ పల్లెగాలి డబ్బాలను నాగరికులు వేలం వెర్రిగా కొంటున్నారు. ఈ పల్లెగాలి 250 మి.లీ. డబ్బా ఖరీదు 7.5 డాలర్లు (రూ.476) మాత్రమే.
పవిత్ర గోవుల అపానవాయువు
గోవులు మనకు పవిత్రమైనవి. గోమూత్రం, గోమయం సహా పంచగవ్యాలు బాబా రామ్‌దేవ్ వంటి వారి పుణ్యాన మన దేశంలో ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మనవాళ్లకు ఆలోచన రాలేదు గానీ, డానియేలా డోరెర్ అనే జర్మనీ మహిళ ఏకంగా గోవుల అపానవాయువును డబ్బాల్లోకి ఎక్కించి, మార్కెట్లోకి విడుదల చేసింది.
ఇది మార్కెట్లోకి విడుదల కావడమే తడవుగా జర్మనీ, ఆస్ట్రియా దేశాల్లో జనం ఈ డబ్బాలను ఎగబడి కొనుగోలు చేశారు. పశువుల శాలలు విరివిగా ఉండే పల్లెల్లో పుట్టి పెరిగి, నగరాలకు వచ్చిన తర్వాత వాటికి దూరమైన వారికి ఈ గాలి సాక్షాత్తు పల్లెలో ఉన్న అనుభూతిని ఇస్తుందని డానియేలా చెబుతోంది. గోవుల అపాన వాయువు డబ్బాలను ఆమె ఆన్లైన్లో కూడా విక్రయిస్తోంది. ఇది ఒక్కో డబ్బా ఖరీదు 8 డాలర్లు (రూ.508) మాత్రమే.
‘యెతి’ గుహాంతర వాయువు
ఇది అలాంటి ఇలాంటి వాయువు కాదు.. ‘యెతి’గా పిలుచుకునే భారీ మంచుమనిషి సంచరించే గుహలోనిదని సెర్బియన్ వ్యాపారులు చెబుతున్నారు. సెర్బియాలోని తష్తగోల్ సమీపంలో అజస్కయా గుహలో ‘యెతి’ ఉండేవాడని, ఆ పరిసరాల్లోనే సంచరించేవాడని చాలాకాలంగా కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
దీనిని సొమ్ము చేసుకునేందుకు కొందరు సెర్బియన్ వ్యాపారులు ఈ గాలిని డబ్బాల్లో బంధించి, మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ గాలితో ఉపయోగం ఏమిటనుకుంటున్నారా..? అక్కడే ఉంది అసలు విషయం. ఈ గాలికి వయగ్రా వంటి వాజీకరణ లక్షణం ఉందని దీనిని విక్రయిస్తున్న వ్యాపారులు ప్రచారాన్ని హోరెత్తించారు. దాంతో జనం ఎగబడి కొనడం మొదలుపెట్టారు. ఇది ఒక్కో డబ్బా దాదాపు 3 డాలర్లు (రూ.190) మాత్రమే.