90 శాతం మంది పీల్చేది ఆ గాలినే...
                  
	ఆధునిక జీవనం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో దాని మాటున కమ్ముకుంటున్న కాలుష్య ప్రమాదం కూడా అంత ముంచుకొస్తోంది. వాయు కాలుష్యం కొరల్లో లక్షలాది మరణాలు సంభవిస్తున్నాయనే హెచ్చరికలు నేపథ్యంలోనే మరో సంచలనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమందిలో తొమ్మిది మంది అంటే 90 శాతం మంది చెడుగాలినే పీల్చుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.
	 
	ఏడాదిలో ఆరు మిలియన్లకు పైగా మరణాలు క్వాలిటీ లేని గాలి(విషపూరితమైన)ని పీల్చుకోవడం వలనే సంభవిస్తున్నాయని తేల్చింది. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ విభాగానికి సంబంధించిన డబ్ల్యూహెచ్ఓ డిపార్ట్మెంట్ అధినేత మరియా నైనా ఈ విషయాలను వెల్లడించారు.
	నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని, మనం ఊహించుతున్న దానికంటే గ్రామాల్లో పరిస్థితేమి మెరుగ్గా లేదని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు పేర్కొన్నారు. నగరాలతో పాటు గ్రామాల పరిస్థితి కూడా అధ్వాన్నంగా మారుతుందని తెలిపారు. 
	 
	అయితే ఇంకో సంచలనకర వార్తమేమిటంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే పేద దేశాల్లో ఈ కాలుష్యమయమైన గాలి ప్రభావం ఎక్కువగా ఉందని రిపోర్టులో పేర్కొంది.  ప్రపంచమంతా, అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కాలుష్య ముప్పుకు ప్రభావితమవుతున్నారని నైనా ఓ ప్రకటనలో చెప్పారు. ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీకి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.  గాలి కాలుష్యంపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
	 
	రోడ్లపై పరుగెడుతున్న వాహనాల శాతాన్ని తగ్గించడం, వ్యర్థ పదార్థాల నిర్వహణను మెరుగుపర్చడం, క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ వాడకానికి ప్రచారం కల్పించడం వంటి చర్యలను ప్రభుత్వాలు ప్రారంభిస్తేనే వాయు కాలుష్యాన్ని నిరోధించవచ్చని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా 3000 నగరాల డేటా ఆధారంగా యూఎన్ గ్లోబల్ హెల్త్ బాడీ ఈ రిపోర్టును రూపొందించింది. డబ్ల్యూహెచ్ఓ పరిమితుల కంటే ఎక్కువగా 92 శాతం మంది నాణ్యత లేని గాలిలో నివసిస్తున్నారని ఈ డేటాలో గుర్తించింది. 
	  
	ప్రమాదకరమైన అవుట్డోర్ గాలితో ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో దానికి సమానంగా ఇన్డోర్ గాలితోనూ సంభవిస్తున్నాయని డేటా హెచ్చరించింది. వంటకోసం బొగ్గును కాల్చడం వల్ల పేద దేశాల్లో ఈ ప్రభావం అధికంగా ఉందని పేర్కొంది. వాయు కాలుష్యానికి సంబంధించిన దాదాపు 90 శాతం మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయని డేటా వెల్లడించింది.  చైనా, మలేషియా, వియత్నాం లాంటి ఆగ్నేయ ఆసియా, పాశ్చాత్య పసిఫిక్ ప్రాంతాలు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నాయని రిపోర్టు తెలిపింది.
	 
	పర్యావరణానికి ముంచుకొస్తున్న కాలుష్య ముప్పుపై చర్చించడానికి గతేడాదే 150 దేశాల ప్రతినిధులు పారిస్లో కాప్ సదస్సు ఏర్పాటుచేశారు. ఆ సదస్సులో కాలుష్య శాతాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పూనుకున్నారు. తాజా డబ్ల్యూహెచ్ఓ రిపోర్టుతో ప్రపంచ దేశాలు వాయు కాలుష్యంపై మరింత పోరాడాల్సి ఉందని వెల్లడవుతోంది.