breaking news
Water ATMS
-
ఎనీటైమ్ వాటర్ నిల్!
నగర ప్రజలకు తక్కువ ధరకే స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ‘వాటర్ ఏటీఎంలు’ నిరుపయోగంగా మారాయి. ఏ టైంలోనూ ఈ మిషన్లలో నీరు నింపడం లేదు. ప్రజల దాహార్తి తీరడం లేదు. నగరం నలుమూలలా 92 ఎనీటైం వాటర్ మిషన్ల ఏర్పాటులో శ్రద్ధ చూపిన జీహెచ్ఎంసీ...నిర్వహణ తీరును పర్యవేక్షించడం మరిచిపోయింది. దీంతో మినరల్ వాటర్ లభిస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. చాలా చోట్ల వాటర్ ఏటీఎంల వద్ద చెత్తా చెదారం పేరుకుపోయి అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని సంస్థలకు ప్రత్యేకంగా ఈ కియోస్క్‌ల ఏర్పాటుకు అనుమతినివ్వడంతోపాటు...స్థలం కూడా జీహెచ్ఎంసీ కేటాయించింది. జలమండలి ఉచితంగా నీరు సరఫరా చేసేలా ఒప్పందం కుదిరింది. అయినా ఫలితం లేకుండా పోయింది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రజలకు తక్కువ ధరకే స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు శ్రద్ధ చూపిన జీహెచ్ఎంసీ.. వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. నిర్వహణ గురించి తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తోంది. తాము వాటర్ ఏటీడబ్లు్య(ఎనీటైమ్ వాటర్) కియోస్క్‌లు ఏర్పాటు చేస్తామంటూ కొన్ని సంస్థలు జీహెచ్ఎంసీని సంప్రదించాయి. ఆర్ఓ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసే నీరు శ్రేయస్కరం కాదని, తమ సాంకేతిక పరిజ్ఞానంతో మినరల్ వాటర్ వస్తుందంటూ ప్రచారం చేయడంతో వాటి ఏర్పాటుకు అంగీకరించారు. ఆమేరకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్(ఈఓఐ)ఆహ్వానించారు. వచ్చిన సంస్థల్లో రెండింటిని ఎంపిక చేశారు. ఎంత నీటికి ఎంత ధర వసూలు చేయాలో నిర్ణయించారు. అంతే తప్ప రెగ్యులర్‌గా వాటిని నిర్వహిస్తారా.. నిర్వహించని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేవేవీ లేకుండానే ఏటీడబ్లు్యల ఏర్పాటుకు అనుమతించారు. ఒప్పందం మేరకు, జీహెచ్ంఎసీ పరిధిలో 300 చదరపు అడుగుల స్థలాన్ని జీహెచ్ఎంసీ అప్పగిస్తే.. జలమండలి నుంచి నీటిని ఉచితంగా సేకరించి, తమ సాంకేతికతతో మినరల్ వాటర్‌గా మార్చి ప్రజలకు తక్కువ ధరకు అందజేస్తామన్నారు. అలా గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో 92 వాటర్ కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. వాటిల్లో చాలా చోట్ల పనిచేయడం లేదు. కొన్ని చోట్ల వాటి చుట్టూ చెత్తాచెదారం చేరినా పట్టించుకునే నాథుడే లేడు. ప్రజల సదుపాయం కోసమని కోరినంత స్థలాన్నిచ్చిన జీహెచ్ఎంసీ అవి పనిచేస్తున్నాయా, లేదా..అనేవాటిని పట్టించుకోలేదు. వాటి నిర్వహణపై తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. జలమండలి నీటిని ఉచితంగా ఇచ్చినప్పటికీ, రవాణా మాత్రం నిర్వాహకులే చూసుకోవాలని తెలిపినట్లు సమాచారం. దాంతో చాలాచోట్ల నిర్వాహకులు నిర్వహణను వదిలేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు సదుపాయం కల్పించాల్సిన రెండు ప్రభుత్వ విభాగాలు ఈ వ్యవహారంలో వేటికవిగా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. తరచూ సిటీ కన్జర్వెన్స్ సమావేశాలు నిర్వహిస్తున్న అధికారులు ఈ అంశంపై తగిన నిర్ణయం కోవాలని.. వస్తున్నది వేసవి అయినందున ప్రజల దాహం తీర్చేందుకు వాటర్ కియోస్క్‌లు ఎల్లవేళలా పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారుల సమాచారం మేరకు కూకట్పల్లి రైతుబజార్, ఎన్టీఆర్ గార్డెన్, ఇందిరాపార్కు, మౌలాలి, చక్రిపురం, చర్లపల్లి, రామంతాపూర్‌లోని గాంధీనగర్, సత్యనారాయణస్వామిగుడి, ఇండిరానగర్, వివేక్‌నగర్ డిమార్ట్ దగ్గర, మున్సిపల్ ఆఫీస్(ఆనంద్‌నగర్), నాగోల్ గవర్నమెంట్ స్కూల్, డెయిరీ, ఎన్జీఓస్ కాలనీ, దిల్సుఖ్నగర్(ఆంధ్రాబ్యాంక్), మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో కియోస్కీలు ఉన్నాయి. -
నీటికీ ఏటీఎంలు..!
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఏటీఎంలలో డబ్బులు తీసుకుంటారు. కానీ నగరానికి ఆనుకుని ఉన్న కనకపురలో నీళ్లు తీసుకోవచ్చు. ఇదేదో అద్భుతం కాదు కానీ, గ్రామీణులకు స్వచ్ఛమైన నీటిని అందించే ఈ ప్రయత్నాన్ని అభినందించక తప్పదు. డాలర్ ముందు రూపాయి రోజు రోజుకు చిన్నబోతున్నా, అదే రూపాయితో పది లీటర్ల మినరల్ వాటర్‌ను ఎంచక్కా పట్టుకోవచ్చు. పైగా ఈ నీటి కోసం చాంతాడంత క్యూలలో నిల్చుకోవాల్సిన అవసరం లేదు. మిషన్‌లో రూపాయి వేసి, పది లీటర్ల నీటిని కింద పట్టుకోవచ్చు. అందుకే కనకపుర వాసులు వీటిని వాటర్ ఏటీఎంలని అంటున్నారు. కాంగ్రెస్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డీకే. శివకుమార్, ఇటీవల లోక్‌సభ ఉప ఎన్నికలో గెలిచిన ఆయన సోదరుడు సురేశ్ కలసి కనకపుర నియోజక వర్గంలో ఇలాంటి 33 నీటి కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి రూ.13 లక్షల వరకు ఖర్చయింది. కరువు కారణంగా కనకపురలో నీటి మట్టం 1,300 అడుగుల లోతుకు పడిపోయింది. ఉప ఎన్నికలకు ముందే సురేశ్ వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ‘నీటి నాణ్యత చాలా బాగుంది. నిన్నటి వరకు మేము బోరు నీటిని తాగేవారం. ఆ నీరు కలుషితమైనదే కాకుండా చాలా కఠినంగా కూడా ఉండేది. మా కుటుంబంలో అయిదు మంది ఉన్నాం. వంటకు, తాగడానికి రోజుకు 20 లీటర్ల నీరు అవసరమవుతుంది’ అని జయమ్మ అనే కార్మికురాలు పేర్కొన్నారు. ఆమె ఓ పెద్ద పాత్రను తీసుకొచ్చి ఓ కియోస్క్‌లో రెండు రూపాయి నాణేలు వేసి 20 లీటర్ల నీటిని పట్టుకెళ్లింది. శివకుమార్ ఏమంటారంటే...‘ప్రధాని, ముఖ్యమంత్రి, ఇతర నాయకులు మినరల్ వాటర్ తాగ గలుగుతున్నప్పుడు, పేదలు ఎందుకు తాగకూడదు. అందుకనే...ఈ నీటి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, బీపీఎల్ కుటుంబాలకు శుద్ధమైన నీటని అందిస్తున్నాం’.