breaking news
Wal-Mart Stores
-
వాల్‌మార్ట్ పెట్టుబడులపై ఇక ఆర్బీఐ దర్యాప్తు!
ముంబై/న్యూఢిల్లీ: అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇక రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. భారతీ గ్రూప్‌తో జాయింట్ వెంచర్ ద్వారా వాల్‌మార్ట్ హోల్‌సేల్(క్యాష్ అండ్ క్యారీ) రిటైల్ వ్యాపారాన్ని భారత్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, వాల్‌మార్ట్ విదేశీ మారకద్రవ్య లావాదేవీల నిబంధనల(ఫెమా)ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. దీనిపై ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసిన ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) తన నివేదికను ఆర్బీఐకి సమర్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, వాల్‌మార్ట్ పెట్టుబడుల విషయంలో నిబంధనలను ఉల్లంఘించలేదని ఈడీ క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో ఇక ఆర్బీఐ ఈడీ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టి తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, భారతీతో జాయింట్ వెంచర్ నుంచి ఇటీవలే తెగతెంపులు చేసుకున్న వాల్‌మార్ట్... భారత్‌లో ఇక సొంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తామని, ఇక్కడి నిబంధనలను తాము పూర్తిగా పాటిస్తున్నామని అంటోంది. -
భాగస్వామ్య వ్యాపారానికి వాల్ మార్ట్, భారతీలు గుడ్ బై!
భారత రిటైల్ రంగంలో భారతీ ఎంటర్ ప్రైజెసెస్, వాల్ మార్ట్ స్టోర్స్ ఇంక్ ల భాగస్వామ్య వ్యాపారానికి తెరపడింది. తమ సంస్థలకు చెందిన వ్యాపార వ్యవహారాలను సొంతంగా నిర్వహించుకునేందుకు భారతీ, వాల్ మార్ట్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రిటైల్ రంగ వ్యాపారంలో ఫ్రాంచైజీ ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. భారత్ లో తమకు అనుకూలంగా ఉండే విధానంలో వ్యాపార కార్యక్రమాల్ని నిర్వహించుకునేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఇరు సంస్థలు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అవగాహన ఒప్పందాలు, చెల్లింపులు, విధానాలకు సంబంధించిన అంశాలకు అమోదం లభించిన మేరకు ఒప్పందాలుంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అన్ని రకాల వ్యవహారాలు పూర్తయిన తర్వాత భారతీ వాల్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లోని భారతీ వాటాను వాల్ మార్ట్ సొంతం చేసుకుంటుంది అని..ఆతర్వాతే బెస్ట్ ప్రైస్ మోడర్న్ హోల్ సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారంపై పూర్తి స్థాయి ఆజామాయిషీ లభిస్తుందని తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై భారతీ ఎంటర్ ప్రైజెసెస్ వైస్ చైర్మన్, ఎండీ రంజన్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయికి తగ్గట్టూ రిటైల్ వ్యాపారాన్ని విస్తరిస్తాం అని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థకు 212 స్టోర్లు ఉన్నాయని.. వ్యాపారాన్ని పెంచడానికి, వినియోగ దారులకు చేరువయ్యేందుకు అన్ని రకాల మార్గాలున్నాయన్నారు.