breaking news
V.Usharani
-
హెచ్‌ఎంలకే పరీక్ష
చిలకలూరిపేట: పాఠశాల విద్యాశాఖ ముందు చూపు, ప్రణాళిక లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రధానోపాధ్యాయుల పాలిట గుదిబండగా మారుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన అంతర్గత పరీక్షల నిర్వహణ రాను రాను కష్టంగా మారుతోంది. ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యా బోధన, పర్యవేక్షణ, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ), 9,10 తరగతులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. వీటి అమలు బాధ్యతలను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అప్పగించింది. మార్గదర్శక సూత్రాలు ఇవే.. సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డెరైక్టర్, పాఠశాల విద్యాశాఖ ఇన్చార్జి డెరైక్టర్ వి. ఉషారాణి ఈ ఏడాది జులైలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు యూనిట్ పరీక్షలు, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు పాఠశాల స్థాయి లేదా స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులే తయారు చేసి నిర్వహించుకోవాలని సూచించారు. ప్రశ్న పత్రాల ముద్రణ , నిర్వహణ కోసం ప్రతి విద్యార్థికి రూ. 2.50 చెల్లిస్తామని పేర్కొన్నారు. 9,10 విద్యార్థుల నుంచి పరీక్షకు 10 రూపాయల వంతున వసూలు చేయవచ్చని సూచించారు. సీసీఈ (సమగ్ర నిరంతర మూల్యాంకనం) నిబంధనల ప్రకారం జిల్లా అంతటా ఏకీకృత పరీక్షలు ఉండరాదని అలా నిర్వహిస్తే ప్రధానోపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విధంగా విద్యా శాఖ కేటాయించిన పరీక్షల నిర్వహణ బాధ్యతలు జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కష్టంగా మారాయి. ప్రశ్న పత్రాల రూపకల్పన, వాటిని జిరాక్స్ తీయించి పరీక్షలు నిర్వహించటం ఆర్థికంగా భారమేనంటున్నారు. ప్రశ్న పత్రాల తయారీ ఇతర ఖర్చులకు ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం రూ. 2.50 మాత్రమే కేటాయించటంతో మిగిలిన మొత్తాన్ని ప్రధానోపాధ్యాయులే భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విధానంలో ఇప్పటి వరకు రెండు యూనిట్ పరీక్షలు, త్రైమాసిక పరీక్షను అష్టకష్టాలు పడి నిర్వహించిన ప్రధానోపాధ్యాయులకు మిగిలిన పరీక్షల నిర్వహణ సవాల్‌గా మారింది. అర్ధ సంవత్సర పరీక్షలు ఈ నెల 15 నుంచి 22 వరకు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలకు నిధులు కూడా విడుదల చేయలేదు. అంతర్గత పరీక్షల నిర్వహణ సక్రమంగా కొనసాగకపోతే రానున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన సిలబస్, బోధనపై ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా పరీక్షల నిర్వహణపై ప్రయోగాలు చేయటం తగదని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యా సంవత్సరం ఆరంభంలోనే నిధులు ఇవ్వాలి.. విద్యా సంవత్సరం ఆరంభంలోనే పరీక్షల నిర్వహణకు సంబంధించిన నిధులు విడు దల చేయాలి. ప్రస్తుతం ఇస్తున్న నిధులను పెంచాలి. విద్యాపరమైన నిర్ణయాలు తీసు కొనే సమయంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. - సీవీఎస్ మణి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
టెర్ట్ దరఖాస్తులు ఆన్లైన్లోనే..!
నేడు టీచర్ పోస్టుల భర్తీ మార్గదర్శకాలు విడుదల పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఉషారాణి వెల్లడి దరఖాస్తు నేరుగా డీఈవో కార్యాలయాల్లో ఇస్తే అనుమతించం ఆన్లైన్ దరఖాస్తు ప్రతిని ధ్రువపత్రాలతో డీఈవోకు అందచేయాలి రేపట్నుంచి దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ‘టెర్ట్’ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్లోనే సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వి.ఉషారాణి సూచించారు. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నేతృత్వంలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ), ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) ఒకే పరీక్షగా ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్ష (టెర్ట్) పేరుతో నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే. నేరుగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందించే దరఖాస్తులను అనుమతించబోమని స్పష్టంచేశారు. తొలుత తమ శాఖ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు ప్రొఫార్మాలో పూర్తి చేసి సమర్పించాలని చెప్పారు. అనంతరం అప్లికేషన్ కాపీపై సంతకం చేసి అర్హత, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాల నకళ్లతో కలిపి ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాల్లో సమర్పించాలన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి మంగళవారం సవివరంగా మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు. 'ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని 9,061 టీచర్ పోస్టులు భర్తీచేస్తాం. జిల్లాలవారీగా, కేటగిరీలు, సబ్జెక్టుల వారీగా, రోస్టర్ వారీగా వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తాం. 3వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవ చ్చు' అని వివరించారు. నూతన ఉపాధ్యాయులు వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికే పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని టీచర్ పోస్టుల భర్తీని ఈ డీఎస్సీలోనే చేపట్టనున్నారు. మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఏజెన్సీ ఏరియాలోని పోస్టులకు ఎస్టీ అభ్యర్ధులు దరఖాస్తు చేయాలి. 'టెర్ట్'నోటిఫికేషన్ వివరాలు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు: డిసెంబర్ 2 నుంచి జనవరి 16 (ఏపీ ఆన్లైన్, ఈ సేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించవచ్చు) దరఖాస్తుల దాఖలుకు గడువు: డిసెంబర్ 3 నుంచి జనవరి 17 హాల్ టిక్కెట్ల డౌన్లోడ్ గడువు: 2015 ఏప్రిల్ 25 రాత పరీక్షల తేదీలు: మే 9, 10, 11 ఎస్జీటీ పోస్టులకు: మే 9 భాషా పండితులు, పీఈటీ లకు: మే 10 స్కూల్ అసిస్టెంట్లకు: మే 11 ప్రాధమిక కీ విడుదల తేదీ: మే 18 కీపై ఆన్లైన్లో అభ్యంతరాలకు గడువు: మే 19 నుంచి మే 25 వరకు తుది 'కీ'విడుదల: మే 27 ఫలితాల ప్రకటన: మే 28 పోస్టుల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం.